Begin typing your search above and press return to search.

100 కోట్లకో ఎమ్మెల్యే.. బీజేపీ ఆఫర్.. 12మంది జంప్

By:  Tupaki Desk   |   16 May 2018 8:31 AM GMT
100 కోట్లకో ఎమ్మెల్యే.. బీజేపీ ఆఫర్.. 12మంది జంప్
X
కర్ణాటక రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అధికారం కోసం పార్టీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. కర్ణాటకలో బీజేపీ 104 సీట్లను మాత్రమే చేజిక్కించుకుంది. మ్యాజిక్ ఫిగర్ కు ఇంకా 8మంది ఎమ్మెల్యేలు కావాలి. దీంతో బీజేపీ.. తమ పార్టీల్లోని అసంతృప్త ఎమ్మెల్యేలకు గాలం వేసినట్టు జేడీఎస్, కాంగ్రెస్ లు ఆరోపిస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు.. సీనియర్ అయితే మంత్రి పదవి కూడా ఇస్తామని ఆశ చూపారని జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను కూడా కాజేసిందని కాంగ్రెస్ నేతలు మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ లోని 12మంది ఎమ్మెల్యేలు కనిపించకుండా పోయారని.. వారందరినీ బీజేపీ బుట్టలో వేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.

బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశానికి కొత్తగా ఎన్నికైన 78మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 66మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. దీంతో మిగతా 12మంది ఎమ్మెల్యేలు బీజేపీకి అమ్ముడుపోయారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఇక జేడీఎస్ పార్టీకి చెందిన రాజ వెంకటప్ప నాయక - వెంకట రావ్ నాదగౌడ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కనిపించకుండా పోయారు. బెంగళూరులోని 5 స్టార్ హోటల్ లో జరిగిన జేడీఎస్ శాసనసభాపక్ష సమావేశానికి ఈ ఇద్దరు నేతలు హాజరు కాకపోవడం గమనార్హం. తమ పార్టీకి చెందిన ఐదుగురు శాసనసభ్యులను ఇప్పటికే బీజేపీ నేతలు సంప్రదించారని జేడీఎస్ చీఫ్ కుమారస్వామి తెలిపారు. వారికి ఒక్కొక్కరికి 100 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చాడని ఆయన బాంబు పేల్చాడు.

వీరేకాక స్వతంత్రంగా గెలిచిన ఆర్. శంకర్ ఇప్పటికే బీజేపీకి తన మద్దతు ప్రకటిస్తూ రాతపూర్వకంగా వెల్లడించారు. దీంతో బీజేపీ సభ్యుల సంఖ్య 105కు చేరింది. మరో ఏడుగురు అవసరం కాగా 100 కోట్లకు ఓ ఎమ్మెల్యేను కొనుగోలు కు ప్లాన్ చేసినట్టు సమాచారం..

*జేడీఎస్ లో చిచ్చు పెట్టిన బీజేపీ..

జేడీఎస్ లోనూ బీజేపీ చిచ్చు పెట్టిందని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. దేవగౌడ కుమారులు కుమారస్వామి.. ఆయన సోదరుడు రేవణ్ణను చీల్చేందుకు ప్రయత్నించిందంటున్నారు. కుమారస్వామికి వ్యతిరేకంగా రేవణ్ణ తిరుగుబాటు చేశాడని.. ఆయన బీజేపీలోకి వెళుతున్నారని ప్రచారం జరిగింది. ఆయన వెంట 10మంది బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని వార్తలు వెలువడ్డాయి. దీంతో అలెర్ట్ అయిన కుమారస్వామి అన్నతో చర్చలు జరిపి మీడియా ముందుకు వచ్చి తిరుగుబాటు లేదని చెప్పించారు. రేవణ్ణ తన మద్దతు కుమారస్వామికే అని చెప్పడంతో జేడీఎస్ లో తిరుగుబాటు సమసిపోయింది. ఇదంతా బీజేపీ - మీడియా సృష్టి అని కుమారస్వామి ఆరోపించారు.

ఇలా అధికారం కోసం బీజేపీ కుయుక్తులు ఇప్పుడు కన్నడనాట ఆసక్తికరంగా మారాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.. 100 కోట్ల చొప్పున పెట్టి ఎమ్మెల్యేను కొంటూ దేశ రాజకీయాల్లోనే బీజేపీ చెడ్డ పేరు తెచ్చుకుంటోదని మండిపడుతున్నారు.. ఈ పరిణామాలు ఇంకా ఎలా మారుతాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.