Begin typing your search above and press return to search.

ఇందూర్ గా నిజామాబాద్... పేరు మార్చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   20 Aug 2019 2:31 PM GMT
ఇందూర్ గా నిజామాబాద్... పేరు మార్చేస్తున్నారా?
X
ఉత్తర తెలంగాణలో ప్రముఖ పట్టణంగానే కాకుండా ఓ జిల్లా కేంద్రంగానే కాకుండా ఓ జిల్లాగా నిజామాబాద్ కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. టీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ కల్వకుంట్ల కవిత ఓ సారి నిజామాబాద్ నుంచే ఎంపీగా గెలిచారు. నిజామాబాద్ ఎంపీగానే లోక్ సభలో సత్తా చాటారు. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కవిత బరిలోకి దిగగా... ఆమెను బీజేపీ అభ్యర్థిగా ఎంట్రీ ఇచ్చిన ధర్మపురి అరవింద్ చిత్తుగా ఓడించేశారు. ఇప్పుడు నిజామాబాద్ పేరు వింటేనే టీఆర్ ఎస్ నేతలకు తడిసిపోయేలా అరవింద్ తనదైన మంత్రాంగాన్ని నడుపుతున్నారు. తాజాగా ఇప్పుడు ఏకంగా నిజామాబాద్ పేరునే మార్చే దిశగా అరవింద్ పావులు కదుపుతున్నారు.

అరవింద్ ఈ దిశగా చేస్తున్న యత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్న విషయం తెలియదు గానీ... ఆయన చర్యతో టీఆర్ఎస్ లో మాత్రం మంట పుట్టేసిందనే చెప్పాలి. అయినా నిజామాబాద్ పేరును మార్చేస్తే.. దానికి ఏం పేరు పెడతారంటే... ఇందూర్ అనే పేరును అరవింద్ ప్రతిపాదిస్తున్నారు. చాలా తెలివిగా అరవింద్ మొదలెట్టిన ఈ యత్నాలు ఎలా సాగుతున్నాయన్న విషయానికి వస్తే... నిజామాబాద్ పేరు స్థానికులకు అంతగా పట్టబం లేదని అరవింద్ సంచలన వ్యాఖ్య చేశారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ పేరును మార్చాలని స్వయంగా నిజామాబాద్ ప్రజలే కోరుతున్నారని కూడా ఆయన ఓ బాంబు పేల్చారు. నిజామబాద్ పేరును ఇందూర్ గా మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారని కూడా అరవింద్ వ్యాఖ్యానించారు.

తాము ఉంటున్న ప్రాంతం నిజామాబాద్ అనే పేరుతో కొనసాగడంలో ఎలాంటి ఔచిత్యం కనిపించడం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారని పేర్కొన్న అరవింద్... నిజామాబాద్ ప్రజల మనోభావాలు ఇందూర్ పేరుతోనే ముడిపడి ఉన్నాయని మరింత సంచలన వ్యాఖ్య చేశారు. ఇందూర్ అనే పేరును నిజామాబాద్ ప్రజలు శుభప్రదమైన పేరుగా భావిస్తున్నారని, పైగా ఇందూర్ అనే పేరు హిందూ, ఇండియా పదాలకు చాలా దగ్గరగా ఉందని కూడా వ్యాఖ్యానించారు.

మొత్తంగా ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయం సంగతి అలా పక్కనపెడితే... అరవింద్ మాత్రం నిజామాబాద్ పేరును ఇందూర్ గా మార్పించేందుకు కంకణం కట్టుకున్నారన్న వాదన అయితే బలంగానే వినిపిస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక పలు కీలక నగరాల పేర్లను మార్యేందుకు చర్యలు తీసుకోగా... అలహాబాద్ పేరును ప్రయాగరాజ్ గా మార్చేసిన సంగతి తెలిసిందే. అలానే ఇప్పుడు నిజామాబాద్ పేరు ఇందూర్ గా మారినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వాదన వినిపిస్తోంది. చూద్దాం... అరవింద్ యత్నాలను కేసీఆర్ అండ్ కో... ఏ మేరకు అడ్డుకుంటుందో?