మేనకమ్మ.. ఈ మాటలు మనకు అవసరమా?

Mon Apr 15 2019 11:05:10 GMT+0530 (IST)

ఎన్నికల వరకే రాజకీయం. ఒకసారి ఆ ప్రక్రియ పూర్తి అయ్యాక ప్రజలందరిని సమానంగా చూస్తే.. వారి సమస్యల్ని పరిష్కరించటం ప్రజాప్రతినిధుల బాధ్యత. నిత్యం పేజీలకు పేజీలకు ధర్మసూత్రాల్ని.. నీతి మాటల్ని.. పర్యావరణ నీతుల్ని చెబుతూ.. ఏం చేయాలి?  ఎలా చేయాలి?  లాంటివి చెప్పే మేనకాగాంధీ నోటి నుంచి ఇటీవల వస్తున్న వ్యాఖ్యలు వింటే షాకింగ్ గా మారుతోంది.నోటితో చెప్పుకోలేని మూగజీవాల బాధల గురించి అదే పనిగా ఆవేదన చెందే మేనకమ్మ.. ఓటరు జీవుల మీద ఇంత కఠినంగా ఉంటారా? అన్న డౌట్ రాక మానదు. ఎన్ని నీతులు చెప్పినా అవన్నీ పేపర్ల మీదా.. పుస్తకాల్లోనే తప్పించి.. తాను పాటించేది లేదన్నట్లుగా మేనక తీరు అనిపించకమానదు.

తనకు ఓటు వేస్తేనే సాయం చేస్తానని ముస్లిం ఓటర్లను బెదిరించి వివాదంలో చిక్కుకున్న కేంద్రమంత్రి మేనక.. మరోసారి నోరు జారారు. తాజాగా ఆమె చెప్పిన మాటల్ని చూస్తే.. ఆమె కావాలనే మాట్లాడుతున్నారే తప్పించి.. నోరు జారినట్లుగా అనిపించదు. ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ నుంచి పోటీ చేస్తున్న ఆమె.. తన ఎన్నికల ప్రచారంలో షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీకి మద్దతుగా ఉండే గ్రామాలను ఏ..బీ..సీ..డీ కేటగిరిలుగా విభజించి.. అభివృద్ధి కార్యక్రమాల్ని చేపడతానని చెప్పారు. బీజేపీకి మద్దతుగా 80 శాతం ఓట్లు వేసే ఓటర్లు ఉన్న గ్రామాలను ఏ కేటగిరిగా.. 60 శాతం లోపు ఓట్లు వేసే గ్రామాలను బీ విభాగంలోనూ.. 50 శాతం కంటే తక్కువ ఉండే ఊళ్లను సీ కేటగిరిలోనూ.. 30 శాతం కంటే తక్కువ ఓట్లు వేసే గ్రామాలను డి గ్రూపులోను ఉంచి.. వాటికి తగ్గట్లు అభివృద్ధి కార్యక్రమాల్ని నిర్వహించనున్నట్లుగా చెప్పారు.

ఇప్పటికే ముస్లిం ఓటర్లను బెదిరించినట్లుగా వస్తున్న ఆరోపణలపై ఈసీ వివరణ అడిగింది. దాని లెక్క ఒక కొలిక్కి రాక ముందే.. తాజాగా మరోసారి తన మాటలతో కొత్త రచ్చకు తెర తీశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి వారు.. తమకు నచ్చిన వారికి ఓటు వేసే హక్కు ఉంది. కానీ.. అలా వేసే వారిని ప్రభావితం చేసేలా.. బెదిరింపులకు దిగేలా గ్రేడ్లు పెట్టి మరీ మాట్లాడుతున్న మేనకమ్మ మాటలు వింటే.. ఆమెలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా? అన్న అభిప్రాయం వ్యక్తవుతోంది. ఓపక్క ఎన్నికల్లో గెలుపు ధీమాను ప్రదర్శిస్తూనే.. మరోవైపు ఇలా బెదిరింపులకు దిగటం ఏమిటంటూ పలువురు మండిపడుతున్నారు. మీలాంటి మేధావులు సైతం గల్లీ లీడర్ల మాదిరి వ్యవహరించటాన్ని ఏమనాలి మేనకమ్మ?