యడ్డీ చేతిలో సిద్ధూ ట్యాపింగ్ టేపుల బ్రహ్మాస్త్రం

Thu May 17 2018 10:08:06 GMT+0530 (IST)


ఒకే ఒక్క సీటు కోసం తెర వెనుక ప్రయత్నాలు చేసి ఉంటే దేశ రాజకీయాలు మరోలా ఉండేవేమో. కానీ.. తమకు బలం లేని సీటు కోసం బేరసారాలకు తెర తీయకుండా.. భావోద్వేగ ప్రసంగంతో భారంగా పదమూడు రోజుల పాలనకు బై చెప్పేసి ప్రధాని పదవికి రాజీనామా చేసిన వాజ్ పేయ్ అప్పట్లో కోట్లాది మంది ప్రజల మనసుల్ని దోచుకున్నారు. ప్రధాని పదవిని సైతం వదులుకోవటానికి సిద్ధమయ్యారే తప్పించి..విలువల్ని వదులుకోవటానికి వాజ్ పేయ్ ససేమిరా అనేవారు.బీజేపీ గురించి గొప్పలు చెప్పుకునే వారంతా ఈ ఉదాహరణను ప్రస్తావించకుండా ఉండలేరు. గుజరాత్ ముఖ్యమంత్రిగా తిరుగులేని రీతిలో చక్రం తిప్పిన మోడీ.. సొంత రాష్ట్రానికి గుడ్ బై చెప్పేసి ప్రధాని పదవిని చేపట్టేందుకు ఢిల్లీకి ఆయన ప్రయాణమైనప్పుడు ఎన్నో ఆశలు.. మరెన్నో ఆకాంక్షలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో బోలెడన్ని అనుమానాలు కూడా ఆయన వెంటే వచ్చాయి.

అయితే.. అందరి అంచనాలకు భిన్నంగా మొదటిసారి తాను పార్లమెంటు లోపలకు వెళ్లే ముందు.. పార్లమెంటుకు మొక్కిన మొక్కుడు చూసిన దేశ ప్రజలకు సరైన ప్రధానమంత్రి ఇన్నాళ్లకు దొరికారని సంతోషించారు. అయితే.. తాము అనుకున్న సరైన పీఎం అనే మాటకు తనదైన శైలిలో అర్థమయ్యేలా చేశారు మోడీ. అధికారం కావాలే కానీ.. దేనికైనా రెఢీ అన్న విషయాన్ని ఇప్పటికే  బిహార్.. గోవా.. మణిపూర్ లో చేతల్లో చేసి చూపించిన కమలనాథులు.. కర్ణాటకలో ఏం అనుకున్నారో అదే చేశారు.

అంచనాల్ని కించిత్ సైతం తేడా రాకుండా.. తనను అంచనా వేసే వారికి సరిగ్గా అర్థమయ్యేలా వ్యవహరించారు మోడీ. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బలం లేకున్నా.. తమను నమ్మి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇస్తే.. గడువు లోపు బలాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రదర్శిస్తానని చెప్పిన యడ్యూరప్పకు ఓకే అనేశారు గవర్నర్.

ఇలానే జరుగుతుందని కొందరు ఊహించారు. వారి ఊహలు ఏ మాత్రం తేడా రాలేదు. మరి.. పవర్ చేతిలోకి వచ్చిన వేళ.. యడ్యూరప్ప ఏం చేయనున్నారు?  గవర్నర్ ఇచ్చిన గడువు లోపు తనకు బలం ఉందన్న విషయాన్ని ఎలా ప్రూవ్ చేసుకోనున్నారు? అన్నది ఇప్పుడు ప్రశ్నలుగా మారాయి.

అయితే.. ఇదేమీ పెద్ద విషయం కాదని.. ప్రత్యర్థుల్ని తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకునేందుకు కమలనాథుల వద్ద అస్త్రం సిద్ధంగా ఉందని చెబుతున్నారు. కర్ణాటక పగ్గాలు చేతిలోకి వచ్చిన వేళ.. గవర్నర్ ఇచ్చిన గడువు లోపుల తమ బలాన్ని ఫ్రూవ్ చేసుకునేలా మంత్రాంగానికి యడ్డీ సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు. దీనికి ప్లాన్ సిద్ధమైందని తెలుస్తోంది.

ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా కొందరు బీజేపీ నేతలు సిద్దూ సర్కారు హయాంపై సంచలన ఆరోపణలు చేయటాన్ని మర్చిపోకూడదు. దీనికి నిదర్శనంగా కర్ణాటకలో అధికార దుర్వినియోగం జరిగిందని.. బీజేపీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయమంటూ ఆదేశాలు జారీ చేసిన వైనంపై తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లుగా ఎంపీ శోభ పేర్కొన్నారు.

బీజేపీ ఎంపీ శోభ ఆరోపణలు చూస్తుంటే.. యడ్డీ తదుపరి యాక్షన్ దేని మీదన్న విషయంపై అవగాహన రావటం ఖాయం. అధికారం చేతిలోకి వచ్చేసిన వేళ.. కేంద్రం అండగా ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని సంచలన ఆరోపణలు.. విమర్శలు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మెడకు చుట్టుకోనున్నట్లుగా చెప్పక తప్పదు.

పనిలో పనిగా తామెంత ప్రయత్నించినా తమ దారికి రాని జేడీఎస్ ను సైతం దారికి రప్పించేలా ప్రయత్నాలు షురూ కానున్నట్లు చెబుతున్నారు

కర్ణాటకలో తమ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఐటీ శాఖ అధికారులు ఎక్కడికి పోయారంటూ జేడీఎస్ నేత కుమారస్వామి విరుచుకుపడిన కాసేపటికే బీజేపీ ఎంపీ  శోభా కరంద్లాజే తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆరోపణలు.. ప్రత్యారోపణలతో కర్ణాటక రాజకీయ వాతావరణం వేడెక్కినట్లు చెప్పక తప్పదు. గవర్నర్ విధించిన 15 రోజుల గడువు లోపు తనకు అవసరమైన బలాన్ని ప్రదర్శించేందుకు ట్యాపింగ్ టేపుల ఉదంతాన్ని యడ్డీ తెర మీదకు తెస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరి.. ఇదెంతవరకూ నిజమో రానున్న రోజులు తేల్చి చెబుతాయని చెప్పక తప్పదు.