Begin typing your search above and press return to search.

గాలి జ‌నార్ధ‌న్ కు బీజేపీతో సంబంధం లేద‌ట‌!

By:  Tupaki Desk   |   8 Nov 2018 9:34 AM GMT
గాలి జ‌నార్ధ‌న్ కు బీజేపీతో సంబంధం లేద‌ట‌!
X
రాజ‌కీయ నాయ‌కులలో చాలామంది ఊస‌ర‌వెల్లుల‌క‌న్నా అధ్వాన్నంగా రంగులు మారుస్తున్నార‌ని ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నా సంగ‌తి తెలిసిందే. నానా బూతులు తిట్టిన పార్టీల‌తోనే అంట‌కాగ‌డం...త‌మ స్వార్థం కోసం పూట‌కో పార్టీ మార‌డంపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. అవ‌స‌రానికి కొంద‌రిని వాడుకొని...అక్క‌ర తీరిన త‌ర్వాత కూర‌లో క‌రివేపాకులా తీసివేయ‌డం నేటి రాజ‌కీయ నాయ‌కులకు నిత్య‌కృత్య‌మైంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఏరు దాటేదాకా ఏరుమ‌ల్ల‌న్నా...ఏరు దాటాక బోడి మ‌ల్ల‌న్న అనే త‌ర‌హాలో ప్ర‌వ‌ర్తించే నేతాశ్రీ‌లు నేడు ఎక్కువ‌య్యారు. క‌ర్ణాట‌క‌లో క‌మ‌ల నాథుల‌ను ప‌లుమార్లు ఎన్నిక‌ల ఏరు దాటించిన‌ కర్ణాటక మాజీ మంత్రి - మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి నేడు ఆ సామెత స‌రిగ్గా స‌రిపోతుంది. గాలి జ‌నార్థ‌న్ కోసం ఈడీ అధికారులు గాలిస్తున్నార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో....గాలి జ‌నార్ధ‌న్ కు బీజేపీకి ఎటువంటి సంబంధం లేద‌ని బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌నం.

ఈడీ అధికారుల కంట‌బ‌డ‌కుండా ఉండేందుకు ఒక పోంజీ కంపెనీకి చెందిన 57 కిలోల బంగారు బిస్కెట్లును గాలి జ‌నార్ద‌న్ దాచిపెట్టిన‌ నేప‌థ్యంలో పోలీసులు ఆయ‌న కోసం గాలిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా, ఈ వ్య‌వ‌హారం నుంచి ఆ కంపెనీని బ‌య‌ట‌ప‌డేసేందుకు ఓ ఈడీ అధికారికి గాలి రూ.కోటి లంచం కూడా ఇచ్చార‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. గాలి జ‌నార్థ‌న్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధ‌మ‌య్యారని, అందుకే ఆయ‌న ప‌రారీలో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో గాలికి త‌మ‌కు సంబంధం లేద‌ని య‌డ్డీ చెప్పారు. చట్టం ముందు అందరూ సమానమే అని యడ్యూరప్ప అన్నారు. మీడియాలో గాలి గురించి వార్త‌లు చూశాన‌ని, మిగ‌తా విషయాలు తనకు తెలీదని య‌డ్డీ అన్నారు.

జనార్దన్ రెడ్డి కేసుకు సంబంధించి కర్ణాటక బీజేపీ నాయకులు స్పంద‌న వ్య‌వ‌హారం హైకమాండ్ చూసుకుంటుందని తేల్చి చెప్పారు. ఆ కేసు వ్య‌వ‌హారంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని గాలి ప్రాణ స్నేహితుడు, మాజీ మంత్రి, బళ్లారి శ్రీరాములు కూడా ఏరు దాటిన త‌ర్వాత‌....తెప్ప త‌గ‌లేశారు. గతంలో బీజేపీలో చక్రం తప్పిన గాలి జనార్దన్ రెడ్డి పై య‌డ్డీ, శ్రీ‌రాములు ఈ త‌ర‌హా వ్యాఖ్యలు చేయ‌డం ఆ పార్టీ కార్యకర్తలకు మింగుడుప‌డ‌డం లేదు. నిజంగా గాలి త‌ప్పు చేస్తే శిక్ష ప‌డుతుంద‌ని, ఆయ‌న‌ను ఎవ‌రూ స‌పోర్ట్ చేయ‌ర‌ని...కానీ, ముందుగానే గాలికి, బీజేపీకి సంబంధం లేద‌ని ప్ర‌క‌ట‌న‌లివ్వ‌డం దారుణ‌మ‌ని వారు అభిప్రాయ‌డుతున్నారు.