'శబరిమల' వివాదం..బీజేపీ వ్యూహాత్మకం?

Sat Oct 20 2018 19:15:24 GMT+0530 (IST)

దక్షిణాదిలో పాగా వేయాలని గత నాలుగేళ్లుగా భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఉత్తరాదిలో ఎంత బలంగా ఉన్నప్పటికీ దక్షిణాదిలో చక్రం తిప్పలేకపోయామనే లోటు కమలనాథులను వెంటాడుతోంది. అందుకే దక్షిణాదిలో అధికారం చేపట్టాలన్న తమ కలను నెరవేర్చుకునేందుకు నాలుగేళ్లుగా పావులు కదుపుతూనే ఉన్నారు. కానీ వారి ప్రయత్నాలు మాత్రం సఫలం కాలేదు. తమిళనాడులో బీజేపీ ఉనికి చాటుకున్నప్పటికీ...తంబీల లోకల్ సెంటిమెంట్ ముందు బీజేపీ పాచికలు పారలేదు. కర్ణాటకలో మరోసారి అధికారం చేపట్టాలన్న కోరిక.....తీరలేదు. ఇక ఏపీలో వచ్చే ఏడాది ఆ అవకాశం లేదు. తెలంగాణలోనూ దాదాపు అదే పరిస్థితి. దీంతో కేరళపై బీజేపీ ఫోకస్ చేసింది. అందులో భాగంగానే `శబరిమల`లో మహిళల ప్రవేశం అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు పావులు కదుపుతోంది.ప్రస్తుతం కేరళలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయ్యప్ప భక్తులకు - సామాజిక కార్యకర్తలకు మధ్య యుద్ధవాతావరణం ఏర్పడింది. సుప్రీం ఆదేశాలు పాటిస్తామని కేరళ సర్కార్ నొక్కి వక్కాణిస్తోంది. దీంతో ఆందోళన కారులకు పోలీసులకు మధ్య వార్ నడుస్తోంది. అయితే ఆ ఆందోళనకారులు - కొందరు భక్తుల వెనుక బీజేపీ ఉందని టాక్ వస్తోంది. కేరళలో పాగా వేసేందుకు అక్కడి ఓట్లు కొల్లగొట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోందట. వామపక్ష కోటకు బీటలు వార్చాలని కమలనాథులు ప్లాన్ వేస్తున్నారట. త్రిపురలో....20ఏళ్ల వామపక్ష పాలనకు చెక్ పెట్టిన బీజేపీ...కేరళను కూడా హస్తగతం చేసుకునేందుకు రెడీ అయిందట. అందుకోసం శబరిమల వివాదాన్ని వాడుకుంటోందట. అంతేకాకుండా `శబరిమల`అంశాన్ని `జాతీయం` చేసి హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని ప్లాన్ వేస్తోందట. ఇప్పటివరకు బీజేపీతో అంటిముట్టనట్లుగా ఉన్న శివసేన కూడా శబరిమల విషయంలో బీజేపీకి మద్దతిస్తోంది. ఇక ఆరెస్సెస్ కూడా ఈ వివాదంతోనే యాక్టివ్ అయింది. వామపక్ష కంచుకోట అయిన పశ్చిమ బంగ - త్రిపురలను చేజార్జుకున్న వామపక్షాలకు ఇపుడు కేరళ కూడా చేజారుతుందేమోనని భయం పట్టుకుందట.