Begin typing your search above and press return to search.

కమలనాథులకు కల్వకుంట్ల కలవరం

By:  Tupaki Desk   |   6 Nov 2018 3:30 AM GMT
కమలనాథులకు కల్వకుంట్ల కలవరం
X
భారతీయ జనతా పార్టీ అధిష్టానం కలవరపడుతోంది. కమలనాథులు కంగారుపడుతున్నారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా - ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన చెందుతున్నారు. ఎందుకు అనుకుంటున్నారా..? ఆ ఇద్దరి నాయకులని కలవర పెడుతున్న అంశం ఏమిటి అనుకుంటున్నారా..? కమలనాథులిని కలవర పెడుతున్నది మరెవరో కాదు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. కమలనాథులిని కలవరపెడుతున్నారు. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య స్నేహం చిగురిస్తుందా..? లేక ఆటంక పరుస్తుందా..అని కలవరపెడుతున్నారు. గడచిన కొన్ని రోజులుగా భారతీయ జనతాపార్టీ - తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య స్నేహం కొనసాగుతోందని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికలలో భాగంగా జరుగుతున్న సభలలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాంగ్రెస్ పైనే విమర్శలు చేస్తున్నారు తప్పా, బిజేపీని ఏమి అనడంలేదు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే రెండు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం లేదు. ఇదంతా ఆ పార్టీల మధ్య స్నేహంగానే చెబుతున్నారు.

ఈ పరిణామాలు ఇలా ఉంటే వాస్తవ పరిస్దితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో స్నేహం చేసిన అది కత్తి మీద సామేనని కమలనాథులు కలత చెందుతున్నట్లు సమాచారం. గతంలో కేసీఆర్ చేసిన పనులే ఇందుకు కారణంగా చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితంగా మెలిగిన కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అంతేకాదు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోసారు. ఇలాంటి వన్నీ గుర్తు చేసుకుంటున్న కమలనాథులకు కేసీఆర్‌తో కలసి నడవడం కష్టంగానే ఉంది. దీంతో కమలనాధులు కలవరపడుతున్నట్లు సమాచారం. దీనికి తోడు హైదారాబాదులో యంఐయంతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ దగ్గరవడం కూడా బిజేపీ అధిష్టానాన్ని ఆలోచనలో పడేస్తోంది. ఒక వైపు యంఐయంతోను, మరోవైపు తమతోను స్నేహం చేయడాన్ని కమలనాథులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో కేసీఆర్‌తో చెలిమి లాభం చేస్తుందా, నష్టం చేస్తుందా అనే మీమాంసలో కమలనాథులు కొట్టుమిట్టులాడుతున్నారు.