Begin typing your search above and press return to search.

టీడీపీ ఆర్థిక మూలాలపై బీజేపీ దాడి!!

By:  Tupaki Desk   |   12 Oct 2018 12:52 PM GMT
టీడీపీ ఆర్థిక మూలాలపై బీజేపీ దాడి!!
X
ఎన్నికల రాజకీయాలు కొత్త మలుపులు తీసుకుంటున్నాయా? వ్యూహాలు - ఎత్తుగడలు రాజకీయాలను దాటి మరింత ముందుకెళ్తున్నాయా? ఫ్యాక్షన్ తరహాలో ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రత్యర్థులపై పైచేయి సాధించే విధానాలు తెలుగు రాజకీయాల్లోకి ప్రవేశించాయా?

తాజా పరిణామాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ దాడులపై కొందరు నేతలను లక్ష్యంగా చేసుకోవడం తెలిసిందే. వారు రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నారన్నదాన్ని బట్టి ఇది రాజకీయ కక్షతో జరుగుతున్న దాడులుగా చాలామంది చూస్తున్నప్పటికీ ఇందులో కొత్త కోణాలూ ఇప్పుడు బయటకొస్తున్నాయి. కొద్దిరోజుల కిందట తెలంగాణలో రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులు జరగడం తెలిసిందే. అక్కడ పాలక తెరాసకు సవాల్ విసురుతున్న ఆయన్ను దెబ్బతీయడానికి ఈ అస్త్రం ప్రయోగించారన్న ఆరోపణలు వినిపించాయి.

అయితే, తాజాగా ఏపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ ఎంపీలపైనా ఐటీ దాడులు జరగడాన్ని కుట్రగా చెబుతున్నారు టీడీపీ నేతలు. ఇతర రాజకీయ పక్షాలు - ఇతర వర్గాల్లోనూ వీరిద్దరిపై దాడులకు ప్రత్యేక కారణాలున్నాయన్న మాట వినిపిస్తోంది.

ముఖ్యంగా సుజనా చౌదరి - సీఎం రమేశ్‌ లు ఎవరన్నది చూస్తే ఇది నిజం కావడానికి గల అన్ని అవకాశాలూ ఉన్నాయనిపిస్తుంది.

సీఎం రమేశ్ తెలుగుదేశం పార్టీలో చాలాకాలంగా చంద్రబాబు వెంట ఉంటూ చిత్తూరు జిల్లా నుంచి కడపకు మారి తెర వెనుక రాజకీయాల్లో త్వరత్వరగా ఎదిగి పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిన నేత.

సుజనా కూడా టీడీపీకి ఆర్థికంగా అండగా ఉంటూ చంద్రబాబు మెప్పు సంపాదించి రాజ్యసభ సభ్యత్వం - కేంద్రమంత్రి అయిన నేత. ఇద్దరూ పార్టీకి వందల కోట్లు పెట్టుబడి పెట్టినవారే. కాంట్రాక్టులు - కంపెనీలతో ఆర్జన భారీగా ఉండడంతో పార్టీకి డబ్బు పెడుతూ తాము సంపాదించుకుంటూ రాజకీయంగా - ఆర్థికంగా బలపడిన ఈ నేతలిద్దరినీ ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులు లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది.

టీడీపీ ఎన్డీయే నుంచి బయటకొచ్చేయడం.. అలాగే, పొరుగు రాష్ట్రం తెలంగాణలో పాలక టీఆరెస్‌తో తలపడేందుకు చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్‌ తో కలిసేందుకు కూడా సిద్ధపడడం.. అదేసమయంలో బీజేపీ - టీఆరెస్‌ లో అవగాహనతో పనిచేస్తుండడం తెలిసిందే. ఈ రాజకీయ లెక్కలే ఇప్పుడు బీజేపీ - టీఆరెస్‌ ల ఉమ్మడి ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీపై ఈ తరహా దాడులకు పురిగొల్పిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే టీడీపీకి ఖజానాలాంటి సుజనా - సీఎం రమేశ్‌ లను కేంద్ర సంస్థలను వాడుకుని బీజేపీ టార్గెట్ చేసిందని వినిపిస్తోంది.

వాస్తవానికి ఏపీలో టీడీపీకి అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ డబ్బు - పోల్ మేనేజ్‌ మెంట్‌ ద్వారా చంద్రబాబు ఎన్నికలను తనకు అనుకూలంగా మార్చుకోగలరన్నది బీజేపీ అంచనా. పోల్ మేనేజ్‌ మెంట్ సంగతి పక్కన పెడితే ఆర్థికంగా ఆ పార్టీకి ఇబ్బందులు పెట్టడమే ఈ దాడుల లక్ష్యంగా తెలుస్తోంది.