Begin typing your search above and press return to search.

బీజేపీ కూడా ఆకర్ష్ మొదలుపెడుతోంది..

By:  Tupaki Desk   |   28 July 2016 6:44 AM GMT
బీజేపీ కూడా ఆకర్ష్ మొదలుపెడుతోంది..
X
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆరెస్ - ఏపీలో పాలక టీడీపీ భారీ ఎత్తున ఆకర్ష్ పథకాలు చేపట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీల్లో చేర్చుకున్న సంగతి తెలిసింది. రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న పార్టీలే అంతగా ఆకర్షిస్తుండగా ఏకంగా కేంద్రంలో ఉన్న తాము ఇంకెంత ఆకర్షించాలనుకుంటున్నారో ఏమో కానీ ఏపీ బీజేపీ నేతలు కూడా తమ గాలాలకు ఎరలు అతికించి ఇతర పార్టీల చెరువుల్లోకి విసరడానికి రెడీ అవుతున్నారు. అవును... తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో రాష్ట్రంలో మరోసారి ఆకర్ష పథకం చేపట్టేందుకు బీజేపీ సమాయత్తమౌతోంది.

గత ఎన్నికల్లో ఆ పార్టీ తెలుగుదేశంతో కలిసి పోటీ చేసి తమ సొంత బలానికి మించిన ఫలితాలనే సాధించింది. అప్పట్లో టీడీపీ వ్యూహరచనతో పాటు మోడీకి అప్పట్లో ఉన్న క్రేజ్ - పవన్‌ కళ్యాణ్‌ విస్తృత ప్రచారం కూడా ఇందుకు దోహదపడ్డాయి. అయితే ఎన్నికలు పూర్తయినప్పట్నుంచి రెండు పార్టీల మధ్య స్పష్టమైన సమ న్వయలోపమేర్పడింది. పైస్థాయిలో దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఇరుపార్టీల కార్యకర్తలు కలిసేందుకు ఇష్టపడ్డంలేదు. ఈదూరం రాన్రాను పెరుగుతోంది. ప్రత్యేక హోదా అంశంలో తెలుగుదేశం నేతలు బీజేపీపై విమర్శలు గురిపెట్టేందుకు వెనుకాడ్డంలేదు. గతంలో కాంగ్రెస్‌ లో కీలకపాత్ర పోషించి బీజేపీలో చేరిన పురందేశ్వరి - కన్నా లక్ష్మీనారాయణ - కావూరి సాంబశివరావు లు తెలుగుదేశాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు సంధిస్తున్నారు. కొన్నిసార్లు ఏకంగా చంద్రబాబుపై కూడా ఆరోప ణలు గుప్పిస్తున్నారు. చీటికీమాటికీ కేంద్రమిచ్చిన నిధులు దుర్వినియోగమౌతున్నాయంటూ మీడియాకెక్కుతు న్నారు. వీరికి బీజేపీ నుంచి కూడా అంతర్గతంగా ప్రోత్సాహం లభిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తు కొనసాగుతుందని ఉన్నతస్థాయిలో ప్రకటిసున్నా పొత్తు పొసగే అవకాశాలైతే లేవని ఇప్పటికే ఆ పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ దశలో ఈ ఏడాది ఏప్రిల్‌ లో ఆరుగురు సభ్యుల బిజెపి బృందం రాష్ట్ర వ్యాప్తంగా 13జిల్లాల్లోనూ తమ పార్టీలో చేరేందుకు ఆసక్తిగల నాయకుల జాబితాను సిద్దం చేసింది. సోము వీర్రాజు - పురందేశ్వరి - కన్నా - కావూరి లతో పాటు రాంభూపాల్‌ రెడ్డి - శాంతారెడ్డిలు ఈ లిస్టు తయారుచేశారు. అయితే వీరు ఎంపిక చేసుకున్న ఏ నాయకుడు బీజేపీలోకొచ్చేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు. ముఖ్యంగా తెలుగుదేశం - వైకాపాల్లో పదవులు రాక అసంతృప్తితో ఉన్న నాయకులపై వీరు దృష్టిపెట్టారు. వారికి కాషాయి కండువాలు కప్పేందుకు ప్రయత్నించారు. అయితే ఎన్నికలకు ముందే ఇతర పార్టీల నుంచి బీజేపీలొ చేరిన నాయకులు పలువురు ఇప్పటికీ పార్టీలో ఎలాంటి గుర్తింపులేకుండా ఉన్నారు. వారెవరికీ కనీసం నామినేడెట్‌ పదవులు కూడా దక్కలేదు. దక్కుతాయన్న ఆశ కూడా సన్నగిల్లింది. దీంతో ఎవరూ బీజేపీలో చేరడానికి ఇష్టపడడం లేదు.

అయితే.. సొంతంగా బలపడానికి తెగ ఉబలాటపడుతున్న బీజేపీ మాత్రం మరోసారి తన ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. మరోసారి టార్గెట్ లిస్టు రెడీ చేయిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌ లోని అన్ని ఎంపి - 175ఎమ్మెల్యే స్థానాల నుంచి సొంతంగా పోటీ చేసేందుకు సమర్థులైన అభ్యర్థుల్ని ఎంపికచేసి పార్టీలో చేర్చుకోవడంతో పాటు ఈ మూడేళ్ళలోను వార్ని పార్టీ పరంగా పటిష్టంగా తయారు చేయాలన్నదే ఈ వ్యూహంలో భాగమని తెలుస్తోంది. అయితే.. బీజేపీలో చేరడానికి ఇప్పటికిప్పుడు ఎవరూ ముందుకొచ్చే సూచనలు కనిపించకపోవడంతో జాబితాలో గట్టిగా పదిమంది పేర్లయినా రాయగలమా అని ఈ పని భుజానికెత్తుకున్న బీజేపీ నేతలు అనుకుంటున్నారు.