Begin typing your search above and press return to search.

మోడీ ఓకే.. అంటే బాబుకు బ్యాండే!

By:  Tupaki Desk   |   9 Nov 2017 4:31 PM GMT
మోడీ ఓకే.. అంటే బాబుకు బ్యాండే!
X
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు మళ్లీ ఒక మాట హాట్ హాట్ గా వినిపిస్తోంది. విభజన చట్టంలో కల్పించిన వెసులుబాటును బట్టి.. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అనేది ఈ 2019 సార్వత్రిక ఎన్నికల్లో గా పూర్తిచేయడానికి కేంద్రం కాస్త సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగురాష్ట్రాల్లో పాలక పార్టీలు రెండూ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు గురించి కేంద్రంపై తొలి నుంచి ఒత్తిడి తెచ్చాయి. వారు పట్టించుకోలేదు. కేసీఆర్ చివరికి మిన్నకుండి పోయారు. చంద్రబాబు ఇటీవలి పర్యటనలో కూడా ఈ విషయం ప్రస్తావించారు. గతంలో ఇప్పట్లో అయ్యే ఛాన్సే లేదన్న భాజపా.. తాజాగా దీనికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రెండు వారాల్లో బిల్లు సిద్ధం చేసి.. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో పెడతారని వార్తలు వస్తున్నాయి.

అయితే అసెంబ్లీ సీట్ల పెంపునకు మోడీ సర్కారు అంగీకరించడం అనేది చంద్రబాబునాయుడుకు ఇబ్బందికరమే అనే కోణంలో కూడా విశ్లేషణలు వస్తున్నాయి. తమ సొంత ప్రయోజనాలు లేకుండా కేంద్రం ఈ నిర్ణయానికి రావడం లేదని, ఏపీలో భాజపాను బాగా పెద్ద సంఖ్యకు పెంచుకునే (విస్తరించుకునే) ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఇప్పటిదాకా ఏపీలో నెంబర్ టూ స్థాయికి వస్తాం.. అంటూ ఏదో పార్టీ మీటింగుల్లో ప్రకటనలు చేయడం తప్ప.. భాజపా పార్టీ బలోపేతానికి ఏపీలో చేసిందేమీ లేనేలేదు. ఆ పార్టీ ఈసురోమని పడి ఉంది. అక్కడేదో చంద్రబాబు కొన్ని సీట్లు విదిలిస్తే పోటీచేసి నెగ్గడం - ఇచ్చిన పదవులు పుచ్చుకోవడం.. లా వారి పరిస్థితి ఉంది. అలా కాకుండా మహారాష్ట్ర తరహాలో.. తమ బలాన్ని పెంచుకుని.. మిత్రపక్షమే అయినా.. ప్రభుత్వాన్ని దబాయించి డిమాండ్ చేసి సాధించుకునేలా ఉండాలనేది భాజపా వ్యూహం. ఆ మేరకు పొత్తుల్లో తమ పార్టీకి కేటాయించే సీట్ల సంఖ్యను బాగా పెంచేట్లయితే మాత్రమే నియోజకవర్గాల పెంపును అనుమతించేందుకు ఒప్పుకుంటున్నారని సమాచారం.

భాజపా సీట్లు పెరిగితే.. బాబుకు ఇబ్బందికరమే. వైకాపాతో కూడా కమలదళం స్నేహంగానే ఉన్నందున భవిష్యత్తులో చిన్న తేడాలు వచ్చినా నెంబర్ గేమ్ అటూ ఇటూ మారే ప్రమాదమూ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా ఫిరాయించి తమ పార్టీలోకి వచ్చిన వైకాపా ఎమ్మెల్యేలను - వారిపట్ల అసంతృప్తితో రగులుతున్న సొంత నాయకుల్ని జమిలిగా కాపాడుకోవాలంటే.. పెంపు అనేది చంద్రబాబుకు తప్పనిసరి. కానీ బీజేపీ షరతుల ప్రకారం.. వారి బలం పెరిగేందుకు సహకరిస్తే.. అధి ఆయనకు ప్రమాదకరమే కావొచ్చునని పలువురి అంచనాగా ఉంది.