Begin typing your search above and press return to search.

బాబు తీరుపై మిత్రుల‌కు ఎన్నో డౌట్లున్నాయే

By:  Tupaki Desk   |   1 Dec 2017 5:03 AM GMT
బాబు తీరుపై మిత్రుల‌కు ఎన్నో డౌట్లున్నాయే
X
ఏపీకి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌ పోల‌వరం ప్రాజెక్టు మిత్రుల మ‌ధ్య క‌ల‌వ‌రానికి కార‌ణం అవుతోంది. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రం వేసిన కొర్రీలు - ఈ క్ర‌మంలో అవ‌స‌ర‌మైతే..ప్రాజెక్టు ప‌నుల‌ను నిలిపివేసి కేంద్రానికి అప్ప‌గిస్తాన‌ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో....బీజేపీ నేత‌ల్లో మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీపై సందేహాలు ముసురుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం తమతో కావాలనే కయ్యానికి కాలుదువ్వుతోందని బీజేపీ నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. తమకు టీడీపీకి దూరం కావాలని గానీ - పోలవరం రాకుండా ఉండాలన్న ఆలోచన ఎంతమాత్రం లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే, టీడీపీనే వ్యూహాత్మకంగా తన అనుకూలమైన మీడియాతో కేంద్రం - ప్రధాని మోడీ ప్రతిష్ఠను దిగజార్చేలా కథనాలు రాయిస్తోందని, వాటిని ఒక్కసారి కూడా ఖండించకపోవడమే దానికి నిదర్శనమంటున్నారు.

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు తాము ఏవిధంగా క‌ట్టుబ‌డి ఉందో గ‌మ‌నించాల‌ని బీజేపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. పోలవరం అడ్డుకోవాలన్నది తమ లక్ష్యం కాదని, టీడీపీతో కలసి ఉండాలనే కోరుకుంటున్నా ఆ పార్టీకి ఆ ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదంటున్నారు.విభజన జరిగిన తర్వాత ముంపు మండలాలను విలీనం చేయకపోతే విభజన వల్ల ప్రయోజనం లేదన్న విషయాన్ని తొలుత తామే చంద్రబాబునాయుడుకు చెబితేనే - ఆయన ఢిల్లీకి వెళ్లి మోడీ దగ్గర పట్టుబడితే ఆర్డినెన్స్ ఇచ్చిన విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వైఎస్ ఉన్నప్పుడు 60 వేల ఎకరాలకు భూముల నష్టపరిహారం 3 వేల కోట్లు ఇస్తే ఇప్పుడు 6 వేల ఎకరాలకు 9 వేల కోట్ల లెక్కలు చెబుతున్నారు. అసలు కేంద్రం పోలవరం అథారిటీ బోర్డుకు డబ్బులిచ్చి - దాని ద్వారా రాష్ట్రానికి నిధులివ్వాలి. దానికి ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇవన్నీ గమనించకుండా బీజేపీపై బురద చల్లడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పోలవరం ఎవరు కడతామని కోరారన్నది జైట్లీ మీడియా సమావేశంలోనే స్పష్టం అయిందని - బాబు సభలో కూడా దానిపై మాట్లాడారని - ఇటీవల ఓ పత్రికలో కూడా అదే వచ్చిందని, దానిపై మాట్లాడితే అభాసుపాలయ్యేది వాళ్లేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇన్ని వేల నిధులిచ్చినా సీఎం నుంచి మంత్రులు - ఎమ్మెల్యేల వరకూ ఒక్కసారి కూడా కేంద్రం గురించి చెప్పడం లేదని - కేంద్రనిధులతో సొంత పథకాలు పెట్టుకుంటున్న తెదేపా సర్కారు అందులో మోదీ ఫొటో కూడా పెట్టడం లేదని గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ తమ పార్టీకి ప్రాధాన్యం ఇవ్వకుండా కావాలని పక్కకుపెట్టడం కాదా? అని ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అడగకపోయినా 24 గంటల నిరంతర విద్యుత్ పథకం కింద ఏపీని చేర్చిన విషయాన్ని ఇప్పటివరకూ చెప్పకుండా, అది తన ఘనతేనని చెప్పడం మంచిదేనా అని ప్రశ్నిస్తున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టుకు టీడీపీతో ఎలాంటి సంబంధం లేదని - అది పూర్తిగా కేంద్రం ప్రాజెక్టు అయినప్పుడు తామెందుకు వ్యతిరేకించి అడ్డుపడతామని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘గత కొద్దినెలల నుంచి హోదా - ప్యాకేజీ - విభజన హామీలపై కొన్ని అనుకూల పత్రికలు మోడీ - బీజేపీ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నాయి. రాష్ట్రానికి ఏమీ చేయడం లేదని వ్యతిరేక కథనాలు రాస్తున్నాయి. అయినా ప్రభుత్వం ఖండించడం లేదంటే దానర్థం ఏమిటి? కేంద్రం సహకారం లేకుంటే రాష్ట్రానికి ఇన్ని సంస్థలు వస్తాయా’ అని బీజేపీ సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో మిత్రపక్షంగా ఉన్నంత మాత్రాన ప్రభుత్వ పనితీరు గురించి విమర్శించకుండా - సొంతంగా ఎదగకుండా ఉండాలని కోరుకోవడం అన్యాయమంటున్నారు. తమ పార్టీని భవిష్యత్తులో నిర్వీర్యం చేసేందుకు ముందస్తుగా అమలు సాగిస్తున్న వ్యూహంలో భాగంగానే ప్రస్తుత పరిణామాలని బీజేపీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు.