Begin typing your search above and press return to search.

సమరభేరీ....హిట్టా...!?..ఫట్టా..!?

By:  Tupaki Desk   |   11 Oct 2018 1:30 AM GMT
సమరభేరీ....హిట్టా...!?..ఫట్టా..!?
X
కింగ్‌ లం కాదు.. .కింగ్ మేకర్లం అని ఒకసారి..... ఇతర రాష్ట్రాలలో చక్రం తిప్పి అధికారంలోకి వస్తామని మరోసారి ప్రకటిస్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలో సంకట స్థితిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారంనాడు సమరభేరి పేరుతో ఎన్నికల ప్రచార సభలో పాల్గున్నారు. ఈ సభకు కరీంనగర్ జిల్లాతో పాటు నిజామాబాద్ - అదిలాబాద్ జిల్లాలకు చెందిన ప్రజలను సమీకరించారు. ఈ బహిరంగ సభకు తెలంగాణ కమలనాథులు ఆశించిన స్ధాయిలో కాకపోయిన ప్రజలు ఎక్కువగానే వచ్చారంటున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రసంగానికి మాత్రం తెలంగాణ రాష్ట్ర నాయకులు ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన రాలేదని అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిని - మహాకూటమిని విమర్శించిన సమయంలో సభలో ఉన్న ప్రేక్షకుల నుంచి అనుకూల స్పందన రాలేదని అంటున్నారు. ఇది తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులకు నిరాశని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. గడచిన నాలుగున్నరేళ్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఒక్క వాగ్దానమూ నెరవేర్చలేదని అమిత్ షా నిప్పులు చెరిగారు. అయితే ఈ నాలుగున్నరేళ్లు వాగ్దానాలపై - వాటి అమలుపై కిక్కురుమనని భారతీయ జనతా పార్టీ నాయకులు ముందస్తు ఎన్నికల సమయంలో మండిపడడం ఏమిటని విమర్శలొస్తున్నాయి. ఎన్నికలు వచ్చాయి కాబట్టి అధికార పక్షాన్ని విమర్శిస్తున్నారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క ఆందోళన కార్యక్రమమైనా చేపట్టారా అని ప్రజల నుంచి ప్రశ్నలు వస్తున్నాయని అంటున్నారు.

బహిరంగ సభకు వచ్చిన వారంత తమవారే అనుకుంటే కమలనాథులు మరింత బురదలో కూరుకు పోతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా కరీంనగర్ సభలో ప్రజల నుంచి వచ్చిన స్పందనే అని వారంటున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాని, పార్టీ తెలంగాణ నాయకులు కాని ప్రసంగిస్తునప్పుడు ప్రజల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. బహిరంగ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు రావడమే గీటు రాయి అయితే కమలనాథుల సభ హిట్ అయినట్లే అంటున్నారు. ఇక ప్రసంగాలకు సభలో వచ్చిన ప్రతిస్పందన చూస్తే భారతీయ జనతా పార్టీ సమరభేరి ఫట్ మంది అని అంటున్నారు. నేడు రేపు అన్ని రాజకీయ పార్టీల సభలకు ప్రజలు వస్తున్నారని, దీనిని స్వఛ్చందంగా రావడం అనే కంటే తరలింపుగానే చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.