లక్ష్మణ్ గారు..బీజేపీ గురించి మరీ ఎక్కువ చెప్పేశారేంటి

Sun Dec 10 2017 20:46:33 GMT+0530 (IST)

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు చేసిన ప్రసంగంపై రాజకీయవర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఓవైపు పార్టీ బలోపేతానికి పార్టీ పరంగా ఆయన కృషి చేస్తున్నప్పటికీ..మరో వైపు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గుర్తు పెట్టుకోకుండా...భారీ ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే....తెలంగాణలో టీఆర్ ఎస్ కు ప్రత్యామ్యాయంగా బీజేపీ మాత్రమే ప్రజా సంక్షేమానికి పాటు పడగలదని లక్ష్మణ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో జరిగిన పార్టీ ఇన్ ఛార్జ్ ల సమావేశంలో డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తమకే పట్టం కట్టనున్నారని...టీఆర్ ఎస్ ను దూరం పెట్టనున్నారని లక్ష్మణ్ చేసిన ప్రసంగం పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యంలో పడేసిందంటున్నారు.అధికారంలోకి వచ్చి మూడున్నర ఏళ్లు పూర్తయినా... గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని టీఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణ లోని సబ్బండ వర్ణాల ప్రజలు కేసీఆర్ పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని - మహిళలు - రైతులు - కార్మికులు - ఉద్యోగులు ఏ ఒక్కరి ప్రయోజనాలను ఈ కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని ఆయన ఆరోపించారు. అటు కాంగ్రెస్ పార్టీ పీకల్లోతు అవినీతి కూపంలో కూరుకుపోయిందని కాంగ్రెస్ కుటుంబ పాలనతో ప్రజలు ప్రజలు విసిగి పోయారని డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. మజ్లిస్ తో అంటకాగుతున్న టీఆర్ ఎస్ సర్కార్ మతతత్వ - ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ధ్వజమెత్తారు.

అవినీతి - కుటుంబ పాలనకు తావు లేని పార్టీ  బీజేపీ మాత్రమేనని - అందుకే ప్రజలు బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ విజయబావుటా ఎగురవేయడం ఖాయమని డాక్టర్ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోందని - ఎవరితో పొత్తులు పెట్టుకునే ప్రశక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు.

కార్యకర్తలు - పార్టీ నేతల్లో విశ్వాసం పెంచేందుకు లక్ష్మణ్ ప్రసంగించినప్పటికీ ఆయన చెప్పిన మాటలు ఆచరణలో సఫలం అవుతాయా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు అధికార పార్టీ బలపడుతుండటం...చేరికల పరంగా చూసినా...ప్రధాన ప్రతిపక్షం బలం పుంజుకుంటున్న తరుణంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలో ఎలా వస్తుందనేది...ఆ పార్టీ నేతల నుంచే వస్తున్న ప్రశ్న. దీనికి లక్ష్మణ్ చెప్పే సమాధానం ఏంటో మరి!