Begin typing your search above and press return to search.

కాళ్లు అడ్డుపెట్టి నీళ్లిస్తా అన్నావ్‌..ఏవి కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   13 Jan 2018 4:19 PM GMT
కాళ్లు అడ్డుపెట్టి నీళ్లిస్తా అన్నావ్‌..ఏవి కేసీఆర్‌?
X
టీఆర్ఎస్ అధినేత‌ - తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎన్నిక‌ల స‌మ‌యంలో చెప్పింది ఒక‌టి...ఇప్పుడు చేస్తుంది ఇంకొక‌ట‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో విచ్చ‌ల‌విడి హామీలు ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు వాటిని నిలుపుకోలేక మ‌ళ్లీ ప్ర‌క‌ట‌న‌ల‌తో స‌రిపుచ్చుతున్నార‌ని వ్యాఖ్యానించారు. వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా ప‌లువురికి పార్టీ కండువా క‌ప్పారు. అలంపూర్లో నియోజకవర్గ ముఖ్య‌నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. అనంతరం డాక్టర్ లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ... వెనుకబడ్డ జిల్లా గద్వాల జిల్లాలో బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు పోతుందన్నారు.

గద్వాల జిల్లా ప్రజలు తాగు - సాగు నీరు లేక ఎన్నో ఏళ్లుగా అవస్థలు పడుతున్నారని - టీఆర్ ఎస్ ప్రభుత్వం గద్వాల జిల్లాకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చలేకపోయిందని ల‌క్ష్మ‌ణ్‌ దుయ్యబట్టారు. టీఆర్ ఎస్ నేతలు ఎన్నికల ముందు గద్వాల జిల్లా అభివృద్ధి కోసం ఎన్నో హామీలిచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటిని విస్మరించి తీవ్ర వివక్షకు గురి చేశారన్నారు. జిల్లా ప్రజలు నీటి చుక్క కోసం అష్టకష్టాలు పడుతున్నారని, ఎటు చూసినా ఎడారిని తలపించేలా భూములన్నాయని జిల్లాలో ప్రాజెక్టులు నిర్మాణం నిర్లక్ష్యానికి గురయ్యాయని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కాళ్లడ్డం పెడితే మన ఇళ్లల్లోకి, పొలాల్లోకి నీళ్లు రావాలన్న కేసీఆర్... మూడున్నరేళ్లయినా కనీసం జిల్లాలోని తాగునీటి సమస్యను కూడా పరిష్కరించకపోవడం దారుణమన్నారు. పక్కనే కృష్ణా నది ఉన్నా... పంటలకు మాత్రం సాగునీరు లేక రైతన్నలు అరిగోస పడుతున్నారని - జూరాల - నెట్టంపాడు - ఆర్డీఎస్ ప్రాజెక్టులు పూర్తికాక నిరుపయోగంగా మారాయన్నారు.

తెలంగాణకు ద్రోహం చేసినవారే ఇవాళ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ప్రభుత్వంలో ఉన్నారని స్వయంగా ఆ పార్టీ సీనియర్ నేతలే వాపోతున్నారని, తక్షణమే తెలంగాణ ద్రోహులను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి చిత్త‌శుద్ధి చాటుకోవాల‌ని ల‌క్ష్మ‌ణ్‌ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో వేల కోట్ల వ్యయాన్ని పెంచారని, దీంతో నేతలు, కాంట్రాక్టర్లు లబ్ధి పొందుతున్నారు తప్పా ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని ఆయన అన్నారు. జూరాల ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా జిల్లా ప్రజలెప్పుడూ అంధకారంలోనే మగ్గుతున్నారని, ప్రజలకు నిరంతరం కరెంటు కోతలే మిగిలాయన్నారు. సీడ్ కాటన్‌ గా పేరున్న గద్వాల జిల్లాలో.. ఎంతో కష్టపడి పత్తి పండించినా పత్తిరైతులు దళారుల బారిన పడి మోసపోతున్నారని, నకిలీ విత్తనాల బెడదతో పంట నష్టం వాటిల్లి అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, నకిలీ విత్తన కంపెనీలపై సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఆయన విమర్శించారు.

సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ పేరుతో ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి కొనసాగిస్తున్నారని, తెలంగాణలో మాత్రం దానికి విరుద్ధంగా కుటుంబ పాలనతో గద్వాల జిల్లా పూర్తిగా వెనకబడిపోయిందని ల‌క్ష్మ‌ణ్ అన్నారు. కార్మికులు, కర్షకులు, అన్నికుల వృత్తులవారు అన్యాయానికి గురయ్యారని డాక్టర్ లక్ష్మణ్‌ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశమంతా అవినీతిలో కూరుకుపోయిందని, టీఆర్ ఎస్ పార్టీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదని, తెలంగాణలో బిజెపిని ప్రజలు ఆదరిస్తున్నారని డాక్టర్ లక్ష్మన్ అన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లక్షా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను నిండా ముంచారన్నారు. నిరుద్యోగ సమస్యపై బిజెపి సమరశంఖం పూరించందని, టీఆర్ ఎస్ చెప్పిన లక్షకు పైగా ఉద్యోగాల్లో చివరి ఉద్యోగం భర్తీ అయ్యేవరకు బిజెపి పోరాటం చేస్తోందని డాక్టర్ లక్ష్మణ్‌ హెచ్చరించారు.