Begin typing your search above and press return to search.

అఫీషియ‌ల్ః టీడీపీతో దోస్తీకి బీజేపీ గుడ్‌ బై

By:  Tupaki Desk   |   23 July 2017 8:18 AM GMT
అఫీషియ‌ల్ః టీడీపీతో దోస్తీకి బీజేపీ గుడ్‌ బై
X
తెలుగుదేశం - బీజేపీల మ‌ధ్య ఊగిస‌లాట‌లో ఉన్న పొత్తు కొన‌సాగింపు అంశానికి తెర‌ప‌డింది. రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ‌దారి త‌మ‌దేన‌ని బీజేపీ స్ప‌ష్టం చేసింది. రాబోయే ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీలు క‌లిసి న‌డవ‌డంపై క‌మ్ముకున్న నీలిమేఘాల‌కు భార‌తీయ జ‌న‌తాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తెర‌దించారు. వరంగల్ లో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు రెండో రోజు ఆయన మాట్లాడుతూ మెజారిటీ కార్యకర్తల అభిప్రాయం ప్రకారమే బీజేపీ నడుచుకుంటుందని పేర్కొన్నారు. ఈ ప్ర‌కారం వ‌చ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని అన్నారు.

బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం పుష్కలంగా ఉందని పేర్కొంటూ పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని ల‌క్ష్మ‌ణ్ అన్నారు. పార్టీలో విస్తృతంగా చ‌ర్చించిన అనంత‌ర‌మే పొత్తుల నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు. తెలంగాణ సాధనకు అడ్డుపడ్డవారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసుకోవడం జీర్ణించుకోలేక పోతున్నామని ల‌క్ష్మ‌ణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలను సమర్ధంగా అమలు చేయడంలో తెలంగాణలోని తెరాస ప్రభుత్వం విఫలమైందన్నారు. తెరాస సర్కార్ వైఫల్యాలను ప్రజటలో ఎండగడతామన్నారు. ప్రజాసమస్యలపై తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు లక్ష్మణ్ చెప్పారు. ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ సాధన బీజేపీ లక్ష్యమన్న లక్ష్మణ్… 2019ఎన్నికల్లో టీఆర్ ఎస్‌ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామన్నారు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందని లక్ష్మణ్ మండిప‌డ్డారు. రాష్ట్రంలో ఉన్న మంత్రులపైనా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని, అవినీతిని నిర్మూలించే దిశగా ప్రభుత్వం పనిచేయాలని తెలిపారు. అన్ని శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోందని, అవినీతి, అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరపాలన్నారు. హైదరాబాద్‌ డ్రగ్‌ మాఫియాకు కేంద్రంగా మారి ఆందోళనలకు గురిచేస్తోందన్నారు. హరితహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లు ఖర్చుపెడుతున్నా ఫలితం శూన్యంగా ఉందని, ప్రజలను హరిహారంలో భాగస్వాములను చేయాలని ల‌క్ష్మ‌ణ్ కోరారు. ఎన్నికల హామీలైన లక్ష ఉగ్యోగాలు - డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లు - దళిత సీఎం - కేజీ టు పీజీ ఉచిత విద్య - దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలేవీ అమలు కావడం లేదని ల‌క్ష్మణ్ అన్నారు.కార్పొరేట్ విద్యావ్యవస్థకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. అధికారం కేంద్రీకృతమైపోయి పాలన అస్తవ్యస్తంగా మారిందని లక్ష్మణ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తోందని తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్ తో ఉగ్రవాదం, నోట్ల రద్దుతో నల్లధనాన్ని, జీఎస్టీతో ద్వంద్వ పన్నులకు చరమగీతం పాడారని ప్రశంసించారు.

బీజేపీతో స‌ఖ్య‌తతో తెలంగాణ‌లో అధికారంలో వ‌చ్చేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు తాజాగా బీజేపీ నేత‌ల ప్ర‌క‌ట‌న‌న‌ను ఏ విధంగా తీసుకుంటారో చూడాలి మ‌రి. అయితే బీజేపీ జాతీయ అధిష్టానం అనుమ‌తి లేనిదే పార్టీ రాష్ట్ర నేత‌లు ఇలా విడాకుల మంత్రం జ‌పించర‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.