టీఆర్ ఎస్ - కాంగ్రెస్ హుషారు..బీజేపీ బేజారు

Mon Nov 20 2017 23:00:02 GMT+0530 (IST)


తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆసక్తికరమైన రాజకీయం జరుగుతోందని అంటున్నారు. అధికార పార్టీ అయిన టీఆర్ ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు పోతూ బలపడ్తుంటే..ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ బలోపేతానికి ప్రణాళికలు రచిస్తుంటే..తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం కూల్ గా ఉన్నారని అంటున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బలమైన రాజకీయ శక్తిగా మారిన తెలంగాణ రాష్ట సమితికి సవాలు విసిరే ప్రత్యర్థులం తామేనంటూ భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు చేస్తున్న ప్రకటనలు ఒట్టి మాటలుగానే మిగిలి పోతున్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణాలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న బలమైన కాంక్ష కేంద్ర నాయకత్వంలో కనిపిసున్నా రాష్ట్ర నాయకత్వంలో మచ్చుకైనా కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం - అనంతరం పలువురు నేతలు ఇటు అధికార టీఆర్ ఎస్ పార్టీలోకి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ లో చేరుతుండగా బీజేపీ వైపు చూస్తున్నవారు ఎవరూ లేదు. మరోవైపు బీజేపీలో అంతర్మథనం మొదలైందని అంటున్నారు.యువతలో క్రేజ్ - సొంత నియోజకవర్గంతో పాటు కనీసం 10 నియోజకవర్గాలను ప్రభావితం చేయగల్గిన వ్యక్తిగత ఇమేజ్ కలిగిన నేతల కోసం బీజేపీ గాలింపు చేపట్టింది. అంతేకాదు...కొందరు బడా నేతలు త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారంటూ ఆ పార్టీ నేతలు ప్రకటనలు సైతం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో రాష్టనాయకత్వంతో విబేధాల కారణంగా అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి సోదరులతో పాటు - తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డి వంటి నేతల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వ్యక్తిగత ఇమేజ్ ఉన్న నేతలను చేర్చుకోవడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలన్నది బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వ్యూహంలో భాగం. ఉత్తర్ ప్రదేశ్ - ఉత్తరాఖండ్ సహా అనేక రాష్ట్రాల్లో ఈ వ్యూహాన్ని అమలు చేసి విజయాలు సైతం సొంతం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ టీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా బలమైన రాజకీయ శక్తిగా బీజేపీని తీర్చిదిద్దాలని అమిత్ షా భావించారు. ఆకర్ష్ మంత్రం జపిస్తూ ఇతర రాజకీయ పార్టీల్లోని బలమైన నేతలను చేర్చుకోవాలని తలచారు. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టు షా ఒకటి తలిస్తే ఇక్కడ మరొకటి జరుగుతోంది.

టీఆర్ ఎస్ కు ప్రత్యర్థిగా ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ మరింత బలోపేతమవుతుండడం బీజేపీ అధినేతలను అసహనానికి గురిచేస్తోంది. తెలంగాణలో అమిత్ షా పర్యటనలో అధికార టీఆర్ ఎస్ ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేయగా వాటికి కాంగ్రెస్  ప్రత్యామ్నాయమని... టీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా నిలిచిన నేతలకు కాంగ్రెస్ పార్టీయే సరైన వేదిక అన్న అభిప్రాయం చాలామందిలో కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ అధికారానికి దూరమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు ఒకింత అసంతృప్తితో ఉన్నారు. రెడ్లకు ప్రాధాన్యతనిచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని వారు చెప్పకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసినవారిలో అత్యధికులు రెడ్డీలనని - వారంతా కాంగ్రెస్ పార్టీకి చెందినవారే కావడం ఇందుకు నిదర్శనమని వారంటున్నారు ఈ పరిస్థితుల్లో వేర్వేరు రాజకీయ పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న రెడ్లంతా కాంగ్రెస్ లో చేరడమే ఉత్తమమని అప్పుడే మళ్లీ రాజ్యాధికారం సాధించగలమని వారు విశ్వసిస్తున్నారు. రేవంత్ రెడ్డి పార్టీ మారే ఎత్తుగడ వెనుక ఉద్దేశం ఇదేనని కూడా వారంటున్నారు.

కాగా తెలుగురాష్ట్రాల్లో పార్టీని విస్తరించడానికి అవకాశమున్నప్పటికీ  పరిస్థితి ఇలా తయారైందని అధిష్టానం ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో తెలంగాణాలో అధికారమే లక్ష్యంగా పోరు సాగించమని కేంద్ర నాయకత్వం చెబుతుంటే కనీసం ప్రధాన ప్రతిపక్షస్థాయికి చేరుకోవడమే కష్టమనే పరిస్థితి ఉంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు కేంద్ర నాయకత్వం తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై దృష్టిసారించింది. గుజరాత్ ఎన్నికల తర్వాత తెలంగాణలోని పరిణామాలపై అమిత్ షా దృష్టి సారించనున్నారని తెలుస్తోంది.