Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ర్టాల్లో బీజేపీ బ‌ల‌ప‌డటం అనే చాన్సుందా?

By:  Tupaki Desk   |   24 April 2018 6:58 AM GMT
తెలుగు రాష్ర్టాల్లో బీజేపీ బ‌ల‌ప‌డటం అనే చాన్సుందా?
X
`ద‌క్షిణాదిన బ‌ల‌ప‌డ‌తాం...ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లో రాబోయే కాలంలో బీజేపీ పెద్ద ఎత్తున పుంజుకోనుంది..ఎంద‌రో ఇత‌ర పార్టీల నేతలు క‌మ‌లం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు`ఇది బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు మొద‌లుకొని ఆ పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీలు, ముఖ్య‌నేత‌లు అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా వ‌ల్లెవేసే డైలాగ్‌. అయితే ఇక ఈ డైలాగ్‌కు ఫుల్ స్టాప్ చెప్పాల్సిందేన‌ని అంటున్నారు. పార్టీ బ‌ల‌ప‌డ‌టం సంగ‌తి ప‌క్క‌న‌పెట్టి...కొత్త నేత‌ల‌ను చేర‌డం అనే సంగ‌తి దేవుడు ఎరుగు ఉన్న నేత‌లే...బైబై బీజేపీ అంటూ వెళ్లిపోతున్నార‌ని వివ‌రిస్తున్నారు. ఇది ఒక్క తెలంగాణ‌కో లేదా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కో ప‌రిమిత‌మ‌వుతున్న అంశం కాద‌ని... రెండు రాష్ర్టాల్లోనూ అదే ప‌రిస్థితి ఉంద‌ని ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా వివ‌రిస్తున్నారు.

గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గులుతున్న ఏపీ విష‌యానికి వ‌స్తే...బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి అనేక మంది పోటీ పడ్డారు. పార్టీ అధ్యక్ష రేసులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్లు చివరి వరకూ పరిశీలనలో ఉన్నాయి. అధిష్టానం మాత్రం సోము వీర్రాజు వైపు మొగ్గు చూపింది. తనకే అధ్యక్ష పదవి దక్కుతుందని ఆశించిన కన్నా లక్ష్మీనారాయణ పదవి రాకపోవడంతో భంగ పడ్డారు. దీంతో వైసీపీలోకి మారాలనే ఆలోచనతో శనివారం గుంటూరులో తన అనుచరులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు కూడా. బీజేపీ గుడ్‌ బై చెప్పి వైసీపీలో ఈనెల 25న చేరనున్నట్లు సమాచారం.కాపు నేతల్లో కన్నాకు మంచి పట్టు ఉంది. రాజకీయాల్లో సీనియర్‌ నేత కావడం, కాంగ్రెస్‌లో మంత్రి పదవి చేసిన అనుభవంతో ఆయనకు అన్ని వర్గాలతోనూ సత్సంబంధాలున్నాయి. రాష్ట్రంలో అసలే అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ నుంచి సీనియర్‌ నేత కన్నా పార్టీ మారేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం కమలం పార్టీకి కోలుకోలేని దెబ్బగా పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు.

ఇక పార్టీ బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న రాయలసీమ విషయాని కొస్తే పాణ్యం ప్రాంతంలో మంచి పట్టు ఉండే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి బీజేపీని వదిలి వైసీపీలో చేరేందుకు సరంజామా సర్దుకున్నట్లు సమాచారం. కాటసాని పార్టీని వదలడం దాదాపుగా నిర్ధారణ కావడంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా పలు వురు పేర్కొంటున్నారు. ఈనెల 28న ఆయ‌న ముహుర్తం ఖ‌రారు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ విషయానికొస్తే మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌ నియోకవర్గానికి చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి ఈనెల 25న బీజేపీని వీడి కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకోనున్నట్లు తెలిసింది. తెలంగాణ టీడీపీలో ఓ వెలుగు వెలిగిన నాగం బీజేపీ త‌న‌ను గౌర‌వించ‌డం లేదంటూ...పార్టీపై నింద‌వేస్తూ...గుడ్ బై చెప్పేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వేగంగా మారుతున్న రాజకీయ, కుల సమీకరణలు కాషాయదళాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. దక్షిణాది రాప్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పట్టు సాధించాలనే ఆలోచనతో మోడీ - అమిత్‌షా ద్వయం వేసే ఎత్తుగడలకు చెక్‌ పడిందని అంటున్నారు.