Begin typing your search above and press return to search.

హెలీకాప్ట‌ర్‌ లో ఎమ్మెల్యేల త‌ర‌లింపు..క‌న్న‌డ‌లో క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   20 Sep 2018 4:32 PM GMT
హెలీకాప్ట‌ర్‌ లో ఎమ్మెల్యేల త‌ర‌లింపు..క‌న్న‌డ‌లో క‌ల‌క‌లం
X
పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క రాజ‌కీయం మ‌రోమారు ర‌స‌కందాయంలో ప‌డింది. అనూహ్య రీతిలో పీఠం ఎక్కిన జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్లు వ‌స్తున్న వార్త‌లు రాష్ర్టంలో మ‌రోమారు హీట్‌ను పెంచింది. కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌ డీ కుమారస్వామి గురువారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తమ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎర వేస్తున్నదని, దీనికోసం మిలిటరీ విమానాలను ఉపయోగిస్తున్నదని ఆరోపించారు. ఎలాగైనా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న బీఎస్ యడ్యూరప్ప.. ఒకేసారి ఎమ్మెల్యేలందరికీ ఎర వేస్తున్నారని విమర్శించారు.

ఈ ఏడాది జ‌రిగిన ఉత్కంఠ‌భ‌రిత పోరులో బీజేపీ - కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మిల మ‌ధ్య అనేక ఎత్తుగ‌డ‌లు చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. బలపరీక్షకు ముందే కర్ణాటక సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంత‌రం జేడీఎస్ నేత కుమార‌స్వామి సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. అయితే , ఆయ‌న స‌ర్కారు ఎంత‌కాలం ఉంటుందో అనే సందేహాం ఇటు బీజేపీ వ‌ర్గాల్లో..అటు జేడీఎస్‌- కాంగ్రెస్ కూట‌మిలో కూడా ఉంద‌నేది నిజం. అలా చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమార‌స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``వాళ్లు అన్ని పరిమితులను దాటేశారు. మిలిటరీ ప్లేన్ల ద్వారా ముంబై - పుణెలకు తీసుకెళ్లి విధానసభలో బలపరీక్ష సమయానికి బెంగళూరుకు తీసుకొస్తామని మా ఎమ్మెల్యేలతో చెబుతున్నారు. ఇదేంటి?`` అంటూ కుమారస్వామి ప్రశ్నించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లతోపాటు ఇతర ఆశలు కూడా చూపిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని కుమారస్వామి వెల్లడించారు. ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలు తమ ఆఫర్‌కు అంగీకరించారని, ఈ సంఖ్య 20 దాటితే వాళ్లను ముంబై, పుణెలకు పంపిస్తామని తమ ఎమ్మెల్యేలతో బీజేపీ చెబుతున్నదని ఆయన ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేలను చూసుకోవడానికి మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం అంగీకరించిందని కూడా వాళ్లు చెబుతున్నట్లు కుమారస్వామి చెప్పారు. రాష్ట్రంలో యడ్యూరప్పను మించిన అవినీతి నేత లేరని ఆయన విమర్శించారు. కేంద్రం తన చేతుల్లో ఉన్నదని తనను బెదిరించే ప్రయత్నం యడ్యూరప్ప చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తమ చేతుల్లో ఉంది కాబట్టి తాము కూడా ఏదైనా చేస్తామని కుమారస్వామి వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలా ఉండ‌గా సీఎం కుమారస్వామి సోదరుడు పీడబ్ల్యూడీ మంత్రి రేవన్న గౌడ కాంగ్రెస్ మంత్రుల శాఖల్లో తలదూర్చడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రభత్వంలో దేవెగౌడ కుటుంబం జోక్యం ఎక్కువైపోయిందని కాంగ్రెస్ వారు వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు ఆయా శాఖల మంత్రులకు కానీ స్థానిక ఎమ్మెల్యేలకు కానీ తెలియకుండానే దేవెగౌడ కుటుంబం అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసిందనే అసంతృప్తి కాంగ్రెస్ మంత్రుల్లో నెలకొంది. ఈ నేప‌థ్యంలో ఈ అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకొని త‌మ స‌ర్కారును ఏర్పాటుచేయాల‌ని బీజేపీ ఎత్తుగ‌డ‌లు వేస్తోంది.