ఆపరేషన్ ఎక్స్.. బీజేపీ భారీ స్కెచ్ ఇదే..

Wed Sep 26 2018 13:34:21 GMT+0530 (IST)

తెలంగాణలో అన్ని పార్టీల్లోనూ ఎన్నికల ఉత్సాహం నెలకొంది. కానీ బీజేపీలో మాత్రం ఆ వాడి - వేడి లేదు.. మరి బీజేపీ ఏం చేస్తున్నట్టు.? అనే ప్రశ్న అందరినీ తొలిచిస్తోంది. కానీ బీజేపీ అదిష్టానం ‘ఆపరేషన్ x’ పేరిట చాపకింద నీరులా వ్యూహం రచించిదని విశ్వసనీయ సమాచారం. ఇంతకీ కమలనాథులు వేసిన ఆపరేషన్ x ఏంటనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న..తెలంగాణ ఎన్నికల బరిలోకి ఇప్పటికే టీఆర్ఎస్ దూకేసింది. 105మంది అభ్యర్థులను ప్రకటించేసింది. అటు కాంగ్రెస్-టీడీపీ పొత్తుతో సీట్లు సర్దుబాటు చేసుకొని ఎన్నికల సమరంలోకి దిగేందుకు రెడీ అవుతున్నాయి. కానీ బీజేపీలో పైకి కనిపించని దూకుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అభ్యర్థులను ప్రకటించడంలో ఏమాత్రం తొందరపడడం లేదట తెలంగాణ బీజేపీ నేతలు. ఈసారి ఎక్కువ స్తానాల్లో గెలవాలని ఆశిస్తున్న బీజేపీ ఇంత స్తబ్దుగా ఉండడానికి కారణమేంటి.? కానీ కమలనాథుల వ్యూహం వేరే ఉందట.. బీజేపీ నింపాదిగా ఉండడానికి ఆపరేషన్ x కారణమట..

ఆపరేషన్ x అంటే.. తాజా మాజీలంట.. మాజీలంటే మాజీ న్యాయమూర్తులు - మాజీ ఐపీఎస్ లు - మాజీ ఐఏఎస్ లు - మాజీ ప్రొఫెసర్లట..సిద్ధాంతాల పరంగా సీరియస్ గా వ్యవహరించే బీజేపీ.. చేరికల విషయంలోనూ అదే స్ట్రాటజీని అమలు చేయాలని నిర్ణయించిందట.. అందుకే సమాజంలో ఏదో ఒక రంగంలో అత్యంత అనుభవం ఉన్న వారిని చేర్చుకొని వారినే అభ్యర్థులుగా ప్రకటించాలని బీజేపీ డిసైడ్ అయినట్టు సమాచారం. అందులో భాగంగానే మాజీ డీజీపీ దినేష్ రెడ్డిని బీజేపీలో చేర్చుకున్నారట.. మాజీ న్యాయమూర్తి రవీందర్ రెడ్డి కూడా త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారట..ఇక ఏపీలో కూడా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కూడా బీజేపీలో చేరారు. ఇప్పుడు తెలంగాణలో పెద్ద ఎత్తున మాజీ అధికారులు - న్యాయమూర్తులు - ప్రొఫెసర్లను చేర్చుకొని అభ్యర్థులుగా ప్రకటించాలని కమలనాథులు పదునుపెడుతున్నారట. ఆపరేషన్ ఎక్స్ ను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారట..

ఇక ప్రత్యర్థి పార్టీల్లోని అసంతృప్తులను - అసమ్మతి నేతలను బీజేపీలో చేర్చుకొని వారికి టికెట్లు ఇచ్చి గెలవడానికి బీజేపీ పావులు కదుపుతోంది. టికెట్లు అందరూ ప్రకటించాక .. దక్కని బలమైన నేతలందరినీ బీజేపీలో చేర్చుకొని బలపడాలని.. తద్వారా ఎక్కువ స్థానాల్లో గెలవాలని బీజేపీ స్కెచ్ గీస్తోంది. బీజేపీకి ఇప్పటికిప్పుడు బలమైన నేతలను తయారు చేయడం చాలా కష్టం. అందుకే ఇతర పార్టీలు - బయట ఉన్న బలమైన నేతలను చేర్చుకొని ఆపరేషన్ ఎక్స్ ను అమలు చేయాలని కషాయ కండువాలు భావిస్తున్నాయి. ఈ వ్యహం మరి ఏ మేరకు ఫలిస్తుందనేది వేచి చూడాలి.