బీజేపీకి ఇంత కన్నా సరుకు దొరకడం లేదా?

Tue Jun 25 2019 12:12:51 GMT+0530 (IST)

నాలుగు ఓట్లు సొంత ఛరిష్మాతో వేయించగలిగే వాళ్లు కానీ వేయించుకునే వాళ్లు కానీ.. వీళ్లలో ఎవరైనా ఉన్నారా? ఇప్పటి వరకూ బీజేపీలోకి చేరిన నేతల జాబితాను  గమనిస్తే.. కొత్తపల్లి గీత - సుజనా చౌదరి - సీఎం రమేశ్ - టీజీ వెంకటేష్ - అంబికా కృష్ణ.. ఇదీ వరస!కాలు తొక్కే నాడే కాపురం చేసే కళ తెలుస్తుందంటారు. భారతీయ జనతా పార్టీ ఇలాంటి నేతలను చేర్చుకుంటుంటే.. వీటితోనే తాము బలోపేతం అయిపోతున్నట్టుగా కమలనాథులు వర్ణించి చెబుతూ ఉంటే వ్యవహారం కామెడీగా మారింది.

సీఎం రమేశ్ - సుజనా  చౌదరి.. కాంట్రాక్టర్లు - వ్యాపారులు. టీజీ వెంకటేష్ కూడా అదే బాపతే. ఏదో తను పోటీ చేసినప్పుడు ఆ పార్టీలకు ఊపు ఉంటే గెలిచారు - లేకపోతే ఓడిపోయారు అదీ ఆయన చరిత్ర. చంద్రబాబు దయ లేకపోతే  గరికపాటి ఎవరో కూడా జనాలకు తెలిసేది కాదు. వీళ్లను చంద్రబాబు నాయుడే  బీజేపీలోకి పంపించారనే ప్రచారం ఎలాగూ ఉండనే ఉంది. వారు వెళ్లడం  వల్ల పార్టీకి నష్టం ఏమీ లేదు - లాభమే అనేది చంద్రబాబు లెక్క అంటారు

ఇక అంబికా కృష్ణ  కూడా అదే బాపతే అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. అంబికా కృష్ణకు చంద్రబాబుతో చాలా సాన్నిహిత్యమే ఉంది. బాలకృష్ణతో సినిమాలు  తీసిన నిర్మాత కూడా ఈయన. ఈయనకు ప్రజలతో మాత్రం అంతకు మించిన సంబంధాలు లేవు!

ఈయన చేరికను కూడా బీజేపీ గొప్పగా చెప్పుకుంటూ ఉంది. తమకో ప్రజా నేత దొరికాడన్న లెవల్లో బీజేపీ కామెడీ చేస్తోంది. అయితే  చంద్రబాబు ఆదేశాలు  లేనిదే అంబికా కృష్ణ  కూడా బీజేపీలోకి చేరి ఉండరని - బీజేపీలో తనకు అనుకూలమైన లాబీని ఏర్పాటు చేసుకోవడానికే చంద్రబాబు నాయుడు ఒక్కొక్కరిని అక్కడకు పంపుతూ  ఉన్నారని పరిశీలకులు  అంటున్నారు.  ఇంత కన్నా సరుకు దొరకకపోవడంతో ఈ విషయంలో బీజేపీ ఉప్పొందిగిపోతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.