Begin typing your search above and press return to search.

ఇవేనా భారతీయ జనతా పార్టీ విలువలు?

By:  Tupaki Desk   |   23 Jun 2019 4:47 AM GMT
ఇవేనా భారతీయ జనతా పార్టీ విలువలు?
X
సుజనా చౌదరి - సీఎం రమేశ్ - టీజీ వెంకటేష్.. వీరిలో ఒక్కోరిది ఒక్కో ఘన చరిత్ర! సుజనా చౌదరి చరిత్ర ఏమిటో సీబీఐ - ఈడీలను అడిగితే చెబుతాయి. బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకున్న కంపెనీలకు సూత్రధారి అనే ఆరోపణలను వాటితో పాటు కేసులను కూడా ఎదుర్కొంటున్నారు సుజనా చౌదరి. ఈయన స్వయంగా ఈడీ - సీబీఐల విచారణకు హాజరయ్యాడు ఆ కేసుల్లో. ఆయనను అరెస్టు చేయబోతున్నారని కొన్ని నెలల కిందట గట్టిగా ప్రచారం కూడా జరిగింది. విచారణకు హాజరైన సమయంలోనే ఆయనను అదుపులోకి తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.

సీఎం రమేశ్ సంగతి సరేసరి. ఈయన చంద్రబాబుకు బినామీ అనే పేరుంది. ఏపీలో భారీ ఎత్తున కాంట్రాక్టులు చేపట్టారు. వాటిల్లో భారీ అక్రమాలు జరిగాయనే ప్రచారమూ జరిగింది. అంచనాలను భారీగా పెంచి ఆ కాంట్రాక్టులను సీఎం రమేశ్ కంపెనీ తీసుకుందని - వాటిని తను చేపట్టకుండా మళ్లీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి.. మధ్యలో ఉండి డబ్బులు దోచేశారనేది సీఎం రమేశ్ పై ఉన్న అభియోగం.ఈ విషయాన్ని ఇప్పుడు టీడీపీ నేతలే చెబుతూ ఉన్నారు.

ఇక టీజీ వెంకటేష్ కూడా బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకున్నారనే మాట వినిపిస్తోంది. వ్యాపార విస్తరణ అంటూ టీజీ కూడా వందల కోట్ల రూపాయలను అప్పులుగా తెచ్చుకున్నారని - అవి కూడా మొండి బకాయిలుగా మారుతున్నాయనే ఆరోపణ చేస్తున్నారు టీడీపీ నేతలు!

ఇలాంటి అప్పులు - కేసులు - సీబీఐ విచారణలు - కాంట్రాక్టుల్లో అక్రమాల ఇమేజ్ లను కలిగి ఉన్న వారిని భారతీయ జనతా పార్టీ చేరదీసింది! వారికి స్వయంగా దగ్గరుండి అమిత్ షా కండువా వేశారు. ఎన్నో అక్రమాలకు పాల్పడిన వారు ఇప్పుడు దేశభక్తులు అయిపోయారు.. అనే సెటైర్ వినిపిస్తోందిప్పుడు!

ఇలాంటి అక్రమార్కులకు - కేసులను ఎదుర్కొంటున్న వారికి బీజేపీ ఎంతో మేలు చేస్తూ ఉందని - కేవలం తమ పార్టీలోకి చేరారు కాబట్టి.. వారిని రక్షించేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని..ఇప్పుడు మరో అంశాన్ని కూడా ప్రస్తావించాలని పరిశీలకులు అంటున్నారు.

నీరవ్ మోడీ - విజయ్ మాల్యా లాంటి వాళ్లు చేసిన నేరాలకూ సుజనా చౌదరిపై నమోదైన అభియోగాలకూ చాలా సాపత్యం ఉన్న విషయాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తూ ఉన్నారు. బీజేపీలో చేరి సుజనా చౌదరి కేసుల భయాన్ని తొలగించుకుంటూ ఉన్నాడని.. ఇదే తెలివైన పనిని విజయ్ మాల్యా - నీరవ్ మోడీలు కూడా చేసి ఉంటే.. వారు కూడా అలా పరార్ కావాల్సిన పని ఉండేది కాదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సుజనా చౌదరిని రక్షిస్తున్న బీజేపీ తమ పార్టీలోకి చేరి ఉండే నీరవ్ మోడీ - విజయ్ మాల్యాలను కూడా కాపాడుకునేదని అభిప్రాయాపడుతూ ఉన్నారు. ఇదీ ఇప్పుడు బీజేపీ పై జనాల్లో కలుగుతున్న జనాభిప్రాయం కూడా!