Begin typing your search above and press return to search.

బీజేపీని వెంటాడుతున్న వాస్తు భయం!

By:  Tupaki Desk   |   21 Oct 2018 10:55 AM GMT
బీజేపీని వెంటాడుతున్న వాస్తు భయం!
X
బీజేపీకి కాలం కలిసి రావడం లేదు. అన్ని ఎదురుదెబ్బలే. గత ఎన్నికల్లో ఎంతో హుషారుగా ఉన్న పార్టీ శ్రేణులు డీలా పడిపోతున్నారు. యోధుల్లా పనిచేసిన వీరులంతా ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. రాష్ట్రాలు చేజారుతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది.. అసలేమైంది.. అంటూ కమలనాథులు తీవ్రంగా మదనపడిపోతున్నారట. వీరందరికీ ఇప్పుడు కనిపిస్తుంది ఒక్కటే. అదే కొత్తగా నిర్మించుకున్న పార్టీ కార్యాలయం.

గత ఫిబ్రవరిలో ఐదంస్తులతో నిర్మించిన పార్టీ కార్యాలయంలో కార్యకలాపాలు మొదలుపెట్టారు. అన్ని హంగులు - సకల సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. కొత్త భవనంలోకి మారామన్న ఆనందం కొన్నాళ్లకే మాయమైపోయింది. యూపీలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓటమి పాలైంది. కర్ణాటకలో అధికారం చేతిలోకి వచ్చినట్టే వచ్చి జారిపోయింది. అక్కడ జరిగిన పరిణామాలు బీజేపీ ప్రతిష్ఠను బాగా దెబ్బతీశాయి.

ఎప్పటి నుంచో మిత్రులుగా ఉన్న కీలక టీడీపీ - పీడీపీలు బద్ధ శత్రువులుగా మారిపోయారు. తెలంగాణాలో పార్టీకి ఎంత ఊపు తీసుకువద్దామని ప్రయత్నిస్తున్నా - మంత్ర దండం పనిచేయడం లేదు. దీంతో అందరి ఆలోచన కొత్త భవనం పైకి మళ్లింది. ఇందులోకి వచ్చిన తరువాత పార్టీకి ఉపద్రవాలు వస్తున్నాయని నమ్మడం ప్రారంభించారు.

ఈ క్రమంలో పాత భవనంలోనే కార్యకలాపాలు సాగించాలన్న డిమాండ్ పెరుగుతుందట. వచ్చే ఎన్నికల్లో అందరం కలిసి అక్కడే పనిచేద్దామని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తున్నారట. ఢిల్లీలోని అశోకా రోడ్ లోని 11వ నెంబరులో ఉండే పాత భవనం ఎంతో శ్రేయస్కరమని చెబుతున్నారు. అలాగే, మోడీకి ఎంతో కలిసి వచ్చిన యశొ నాయక్ కు చెందిన ఎస్టేట్ బంగళాను వార్ రూంగా మార్చాలని కోరుతున్నారట. 300 మందితో నిరంతరం పనిచేసే వార్ రూం ఏర్పాటుపై మల్లగుల్లాలు పడుతున్నారట.

ఎంతో ఇష్టంగా - ఠీవీగా కనబడేలా నిర్మించుకున్న భవనం పనికి రాకుండా పోయిందన్న బాధ ఒకవైపు - వరుస వైఫల్యాలు మరోవైపు కమలనాధులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకోటి లేదు. ఏం చేస్తాం కాలం కలిసి రాకపోతే ఆ కాలాన్నే నిందించడం తప్ప.