Begin typing your search above and press return to search.

ఏపీలో పాగా కోసం బీజేపీ కొత్త ప్లాన్‌

By:  Tupaki Desk   |   29 April 2017 6:28 AM GMT
ఏపీలో పాగా కోసం బీజేపీ కొత్త ప్లాన్‌
X
ద‌క్షిణాదిలో బ‌లోపేతం అనే టార్గెట్ పెట్టుకొని వేగంగా ముందుకు సాగుతున్న బీజేపీ ఈ క్ర‌మంలో తెలుగు రాష్ర్టాల‌పై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులో మిత్ర‌ప‌క్షమైన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ఏపీలో బ‌ల‌ప‌డటం కూడా క‌మ‌ళ‌నాథులు కీల‌కంగా భావిస్తున్నారు. తాజాగా ఈ క్ర‌మంలో కొత్త ప్లాన్ ఒక‌టి సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నప్పటికీ, వచ్చే ఎన్నికల నాటికి 15 పార్లమెంటు స్థానాల్లో కీలకశక్తిగా ఎదిగే ప్రణాళికకు ఆ పార్టీ నాయకత్వం పదునుపెడుతోంది. ఆ మేరకు గత రెండేళ్లుగా విజయం సాధించిన, వివిధ రాష్ట్రాల్లో అనుసరించిన పోలింగ్ బూత్ వ్యవస్థ బ‌లోపేతం చేయ‌డం అనే ప్ర‌ణాళిక‌నే ఇక్కడా అమలుచేయనుందని స‌మాచారం.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో తెలుగుదేశం-బీజేపీల‌ మధ్య జరుగుతున్న దోబూచులాటకు రాష్టప్రతి ఎన్నికల తర్వాత తెరపడే అవకాశాలున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన రాష్టప్రతి ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే అవసరం ఉన్నందున, వివిధ రాష్ట్రాల్లోని మిత్రపక్షాలతో సఖ్యతను కొనసాగిస్తున్న బీజేపీ నాయకత్వం - ఆ తర్వాత ఆయా రాష్ట్రాల్లో సొంతంగా ఎదిగే వ్యూహానికి పదునుపెడుతున్నట్లు సమాచారం. ఒకవైపు అధినాయకత్వ స్థాయిలో టీడీపీతో సఖ్యతగా వ్యవహరిస్తోన్న బీజేపీ, మరోవైపు రాష్ట్రంలో సొంతంగా ఎదిగే ప్రణాళిక రూపొందిస్తోంది. ``మనమే అధికారంలోకి వచ్చేలా పనిచేయండి.. బూత్‌ కు పదిమందిని చేర్పించడమే పనిగా పెట్టుకోండి.. మీ రాష్ట్రంలో పార్టీ ఎలా అధికారంలోకి రాదో చూస్తాను`` అని పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా రాష్ట్ర నాయకులకు పదే పదే చెబుతుండ‌టం కూడా ఆస‌క్తిక‌రం. తనను కలసినప్పుడు, రాష్ట్రానికి వచ్చినప్పుడు నిర్వహించే అంతర్గత సమావేశాల్లోనూ అమిత్‌ షా ఇదే విధంగా దిశానిర్దేశం చేస్తుండటం బట్టి, ఆ పార్టీ రాష్ట్రంలో ద్విముఖ రాజకీయ వ్యూహంతో వెళుతున్నట్లు స్పష్టమవుతోంది. రాష్టప్రతి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో, రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/