Begin typing your search above and press return to search.

శివాలయాన్ని కూల్చి.. తాజ్‌ మహల్ కట్టారు!

By:  Tupaki Desk   |   18 Oct 2017 4:51 PM GMT
శివాలయాన్ని కూల్చి.. తాజ్‌ మహల్ కట్టారు!
X
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చారిత్రక కట్టడం తాజ్‌ మహల్‌ పై బీజేపీ నేతల విమర్శలు - వివాదాస్పద కామెంట్లు కొనసాగుతూనే ఉన్నాయి. అది దేశ ద్రోహులు నిర్మించిన కట్టడం అని ఆ పార్టీ ఎమ్మెల్యే సోమ్ చేసిన కామెంట్స్‌ పై దుమారం ఇంకా సద్దుమణగనే లేదు...తాజాగా ఎంపీ వినయ్ కతియార్ అలాంటి కామెంట్లే చేశారు. ``తాజ్‌ మహల్ నిజానికి ఓ హిందూ దేవాలయం. దాని పేరు తేజోమహల్. అది శివాలయం. షాజహాన్ దానిని కూల్చి తాజ్‌ మహల్ కట్టాడు`` అని కతియార్ ఓ టీవీ చానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

``ప్ర‌స్తుతం తాజ్ మ‌హ‌ల్ ఉన్న‌ అక్కడ దేవాలయం ఉన్నది నిజం. అంతమాత్రాన ఇప్పుడు నేను తాజ్‌ మహల్‌ ను కూల్చాలని అనడం లేదు. ఇక సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజ్‌ను సందర్శించినా నాకు అభ్యంతరం లేదు`` అని కతియార్ చెప్పారు. అయోధ్యలో రామ జన్మభూమి - బాబ్రి మసీదు వివాదంలాగే తాజ్‌ మహల్ - తేజోమహాలయపై కూడా చాలా రోజులుగా వివాదం చెలరేగుతూనే ఉంది. ఇక అయోధ్యలో రామాలయంపై కూడా కతియార్ స్పందించారు. ఈ కేసులో సుప్రీం సానుకూల తీర్పు ఇస్తుందని ఆశిస్తున్నామని, ఒకవేళ అలా రాకపోయినా తమ దగ్గర వేరే మార్గాలు ఉన్నాయని ఆయన అన్నారు. మందిర నిర్మాణానికి తాము సిద్ధంగా ఉన్నామని, క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ఈ వ్యాఖ్య‌ల‌కు కొన‌సాగింపుగా బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సైతం స్పందించారు. దేశంలో జరిగే వివిధ ఘటనలపై తనదైన శైలిలో స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. తాజ్‌ మహల్‌ ను మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ ఆక్రమిత భూమిలో నిర్మించారని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు. ఈ విష‌యంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వివాదం నేప‌థ్యంలో తాను ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తున్న‌ట్లు సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి తెలిపారు.