Begin typing your search above and press return to search.

బెల్జియంలో వేలం వేసిన వజ్రం టీటీడీదేనా.?

By:  Tupaki Desk   |   22 May 2018 7:46 AM GMT
బెల్జియంలో వేలం వేసిన వజ్రం టీటీడీదేనా.?
X
బెల్జియం దేశంలో వేలం వేసిన వజ్రం ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై ఆ దేశం నుంచి వివరణ కోరాల్సిన అవసరముందని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు సంచలన ఆరోపణలు ఆయన చేశారు.. టీటీడీ పవిత్రతను టీడీపీ ప్రభుత్వం మంటగలుపుతోందని.. తిరుమల శ్రీవారి ఆభరణాలపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ ఆభరణాలన్నీ బహిర్గతం చేయాలని మాధవ్ డిమాండ్ చేశారు.. స్వామి వారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయని ఈవో చెబుతున్నారని.. అయితే ఆయనే స్వయంగా వాటిని చూసి చెబుతున్నారా.? లేదా ఇలా చెప్పమంటూ ఎవరైనా ఆయనను ప్రభావితం చేస్తున్నారా అన్నది సందేహంగా ఉందన్నారు.

టీటీడీ చైర్మన్ గా నియమించిన వ్యక్తిపై అనేక ఆరోపణలున్నాయని, ఆయనకు ఎందుకు ఆ పదవి కట్టబెట్టారని మాధవ్ ప్రశ్నించారు. వైఎస్ హయాంలో టీటీడీ ధార్మిక మండలిని ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ధార్మిక మండలిని లేకుండా చేసి చంద్రబాబు ప్రభుత్వం అవినీతి పాల్పడుతోందని బీజేపీ ఎమ్మెల్సీ మండిపడ్డారు..

టీడీపీ నాయకులు - అధికారులు వరుసబెట్టి ప్రెస్ మీట్లు పెట్టి మరీ రమణ దీక్షితులను విమర్శిస్తున్నారంటే ఏదో తప్పు జరిగే ఉంటుందని మాధవ్ అనుమానం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల ఇష్టదైవమైన వేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే చంద్రబాబుకు పుట్టగతులుండవని మాధవ్ ధ్వజమెత్తారు. టీటీడీ వ్యవహారంపై ఉన్నతస్థాయి కమిటితో విచారణ జరిపించాలని మాధవ్ డిమాండ్ చేశారు.