రైల్వే జోన్ తో ప్రజలకు ఉపయోగం లేదట

Tue Mar 13 2018 11:09:47 GMT+0530 (IST)

సొంత ప్రజలు ఛీ కొడుతున్నా.. తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. ఏపీ బీజేపీ ఏమ్మెల్సీలకు ఆ చురుకు అస్సలు తగలటం లేదు. అధినాయకత్వం మీద తమకున్న వినయవిధేయతల్ని ప్రదర్శించేందుకు ఒకరితో మరొకరు పోటీ పడుతున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా మోడీ సర్కారు వ్యవహరిస్తుందన్న విషయాన్ని కోట్లాది మంది ఆంధ్రోళ్లు ఆగ్రహం చెందుతున్నా.. ఏపీ బీజేపీ నేతలు మాత్రం తమ నాయకత్వం తీసుకున్ననిర్ణయాన్ని బలంగా సమర్థించటం గమనార్హం.తాజాగా ఆ జాబితాలోకి చేరారు ఎమ్మెల్సీ మాధవ్. ఎన్డీయేలో ఉన్నామని చెబుతూనే.. కేంద్రాన్ని నేరుగా దూషించటం తప్పు అని.. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో చెప్పాలని మాధవ్ ప్రశ్నిస్తున్నారు. కేంద్రంపై రెచ్చగొట్టే రీతిలో బాబు మాట్లాడుతున్నారని తప్పు పట్టారు. ఏపీ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నరైల్వే జోన్ పై మాధవ్ తాజాగా ఒళ్లు మండే మాట చెప్పారు.

రైల్వే జోన్ తో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని.. దీని విషయాన్ని రాజకీయ కారణాలతోనే తీసుకొస్తున్నారే తప్పించి మరేమీ లేదని చెబుతున్నారు. ఓపక్క రైల్వే జోన్ మీద నీళ్లు జల్లుతూ కేంద్రంలోని సీనియర్ అధికారులు తేల్చి చెబుతున్న వేళ.. బీజేపీ ఎమ్మెల్సీ సైతం అదే రీతిలో మాట్లాడటం గమనార్హం. జోన్ ప్రజలకు అవసరం లేదనే బీజేపీ ఎమ్మెల్సీ తీరు బరితెగింపునకు నిదర్శనంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కేవలం పదవి కోసం.. పార్టీని కొమ్ముకాసే ఈ తరహా నేతల కారణంగానే ఏపీ ప్రయోజనాలు దారుణంగా దెబ్బ తీస్తున్నాయని చెబుతున్నారు. కేంద్రానికి మద్దతు పలకటం ద్వారా.. కోట్లాది మంది సొంత ప్రజలకు అన్యాయం చేస్తున్నామన్న భావన ఏపీ బీజేపీ నేతలకు ఎందుకు రావటం లేదన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. తమను తప్పు పడుతున్న బాబుపై ఫైర్ అవుతున్న బీజేపీ నేతలు.. తమను ప్రజలు కూడా అంతకు రెట్టింపు ఫైర్ అవుతున్నారన్న విషయాన్ని గుర్తిస్తే మంచిదంటున్నారు.