పవన్ గాలి మారింది... నేను జనసేనలో చేరట్లేదు

Mon Jan 21 2019 21:25:17 GMT+0530 (IST)

బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలోకి చేరారు. పార్టీ కండువా కప్పి ఆకుల సత్యనారాయణ దంపతులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఎపిసోడ్ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై అందరి దృష్టి పడింది. ఆయన సైతం పార్టీ మారనున్నట్లు పలువురు జోస్యం చెప్పారు. దీంతో విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారబోనని స్పష్టం చేశారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీపై విష్ణుకుమార్ రాజు ఘాటుగా స్పందించారు. గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ అనే పదంలో బీ అంటే బీజేపీ జే అంటే జగన్ పీ అంటే పవన్ కల్యాణ్ అని టీడీపీ నేతలు విమర్శించారని గుర్తు చేశారు. కానీ రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సాయం లేకుంటే గెలవడం కష్టమని చంద్రబాబు గుర్తించారని అందుకే పవన్పై టీడీపీ నేతల విమర్శలు తగ్గినట్టు కనిపిస్తున్నాయని విశ్లేషించారు. పవన్ కల్యాణ్ గాలి కూడా కాస్త మారినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. బీజేపీ అంటే బీ - బీజేపీ జే - జగన్ పీ - పవన్ కల్యాణ్ అని విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు పవన్ను తీసేశారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల్లో పవన్ ఉన్నాడని చెప్పినవాళ్లు ఇప్పుడు కొత్త ట్విస్ట్లు ఇస్తున్నారని మండిపడ్డ విష్ణుకుమార్ రాజు... ట్విస్ట్లు యూటర్న్ లకు అధికార పార్టీ పెట్టింది పేరు అంటూ సెటైర్లు వేశారు.

తనకు నలభై ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఆ అనుభవాన్ని వాడాలో తెలుసునని విష్ణుకుమార్ రాజు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ను రెండింతలు పెంచడం కచ్చితంగా ఎన్నికల స్టంట్ అని ఆయన వ్యాఖ్యానించారు.టీడీపీ మాత్రం ఓట్ల కోసం స్వార్థంతో రాజకీయాలు చేస్తోందన్నారు. బీజేపీ జనసేనతో చేతులు కలపడం వల్లే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని మళ్లీ అదే ప్రయత్నం చేస్తోందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. బీజేపీ సత్తా చాటుతామన్నారు. ఎన్ని పార్టీలు కలిసినా కేంద్రంలో బీజేపీని ఏం చేయలేమని విపక్షాలను ఉద్దేశించి అన్నారు. తాను పార్టీ మారడం లేదన్నారు.