Begin typing your search above and press return to search.

పట్టిసీమ గాయాన్ని రేపుతున్న బీజేపీ

By:  Tupaki Desk   |   21 March 2018 5:27 PM GMT
పట్టిసీమ గాయాన్ని రేపుతున్న బీజేపీ
X
ఏపీ అసెంబ్లీలో సడెన్‌ గా విపక్ష పాత్రలోకి వచ్చేసిన బీజేపీ ఇప్పుడు పాలక టీడీపీపై విమర్శల వర్షం కురిపిస్తోంది. ప్రత్యేకించి పోలవరం - పట్టిసీమ గాయాన్ని కదుపుతూ టీడీపీకి నొప్పి కలిగేలా చేస్తోంది. ఇంతకాలం ఏపీ అసెంబ్లీలో వైసీపీ మాత్రమే పోలవరం - పట్టిసీమలపై గళం విప్పేది . అందులో జరిగిన - జరుగుతున్న అక్రమాలను బయటపెట్టేది. ఇప్పుడు బీజేపీ ఆ బాధ్యత తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

తాజాగా బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు - మాజీ మంత్రి మాణిక్యాలరావులు విపక్ష పాత్ర పోషిస్తూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై విరుచుకుపడ్డారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై విమర్శలు చేశారు. పట్టిసీమ నిర్మాణానిక రూ.1300 కోట్లు ఎందుకైందో విచారణ జరపాలని వారు కోరారు. ఈ పథకంలో టీడీపీ నేతలు భారీ అవినీతికి పాల్పడ్డారని.. సీబీఐతో కానీ - సిటింగు జడ్జితో కానీ విచారణ జరిపితే అసలు గుట్టు బయటపడుతుందని అన్నారు.

పట్టిసీమలో కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చడానికి నిబంధనలు మార్చేశారని.. ఫలితంగా రూ.371 కోట్లు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిందని వారు ఆరోపించారు. పట్టిసీమతో కలిగే ప్రయోజనం విలువ కంటే దానికైన ఖర్చే అధికమని కాగ్ చెప్పిందని.. పోలవరం పూర్తయ్యాక పట్టిసీమ పనే ఉండదని కూడా కాగ్ పేర్కొందని వారు సభలో ఆరోపించారు.