సినిమాల్లో మాదిరి ఆ ఎమ్మెల్యేని లారీతో ఢీ ఫ్లాన్?

Mon Apr 09 2018 12:49:45 GMT+0530 (IST)

చాలా సినిమాల్లో చూసిన సీనే.. రియల్ గా జరిగింది. అయితే.. డ్రైవర్ అప్రమత్తతో వ్యవహరించటంతో బీజేపీ ఎమ్మెల్యే కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాద్ మహానగరంలో చాలామంది బీజేపీ నేతలు ఉన్నా.. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యవహారం కాస్త భిన్నంగా ఉంటుంది. దూకుడుగా వ్యవహరించే ఆయనపై పలువురు విమర్శలు చేస్తుంటారు.ఫక్తు హిందుత్వవాదిగా ముద్రపడిన రాజాసింగ్ కు తాజాగా ఒక పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. తనపై దాడికి ప్రయత్నించిన వారిపై రాజాసింగ్ ఫిర్యాదు చేశారు. ఇంతకూ జరిగిందమేంటే.. గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం మహారాష్ట్ర ఔరంగాబాద్ లో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు.

సభ పూర్తి అయ్యాక ఆయన హైదరాబాద్ కు రిటర్న్ అయ్యారు. అర్థరాత్రి వేళలో హైదరాబాద్ కు తిరిగి వస్తున్న వేళ.. ఆయన జర్నీ స్టార్ట్ చేసి 30 కిలోమీటర్లు ప్రయాణించగానే.. ఆయన కారును ఒక గుర్తు తెలియని వ్యక్తి లారీతో ఢీ కొనాలని చూసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఆ సమయంలో రాజాసింగ్ డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఇదిలా ఉంటే.. రాజా సింగ్ వెనుక వస్తున్న కారు మాత్రం ప్రమాదానికి గురైంది.

ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. క్లీనర్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.  ప్లాన్ వేసి తనను మట్టు పెట్టేందుకే ప్రయత్నించారని రాజాసింగ్ ఆరోపించారు. తన డ్రైవర్ అప్రమత్తత వల్లే పెను ప్రమాదం తప్పిందని రాజాసింగ్ చెప్పారు. పథకం ప్రకారమే లారీతో తన కారును ఢీ కొట్టాలని చూసినట్లుగా ఆయన ఆరోపించారు.