Begin typing your search above and press return to search.

బీజేపీ కొంప ముంచిన 27 సీట్లు!

By:  Tupaki Desk   |   17 May 2018 4:07 AM GMT
బీజేపీ కొంప ముంచిన 27 సీట్లు!
X
క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు వచ్చేశాయి. ఎవ‌రికెన్ని సీట్లు అన్న‌ది అంద‌రికి తెలిసిపోయింది. అధికారాన్ని చేప‌ట్టేందుకు కూత‌వేటు దూరానికి వ‌చ్చి మ‌రీ బీజేపీ ఆగిపోయింది.బీజేపీకి వ‌చ్చిన 104 సీట్ల‌కు మ‌రో 8 సీట్లు అద‌నంగా వ‌చ్చి ఉంటే క‌మ‌ల‌నాథుల‌కు ఎలాంటి క‌ష్టాలు ఉండేవి కావు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కిందామీదా ప‌డుతూ.. భారీ వ్యూహాన్ని సిద్ధం చేసిన ఆ పార్టీ.. ఎన్నిక‌ల వేళ‌లో మ‌రింత దృష్టి సారించి ఉంటే.. ఎనిమిదేమిటి.. ఏకంగా 27 సీట్లు ఆ పార్టీ ఖాతాలో ప‌డేవ‌ని చెబుతున్నారు.

పోలింగ్ వేళ క‌మ‌ల‌నాథులు మ‌రింత ఫోక‌స్ చేసి ఉంటే.. ఎలాంటి క‌న్ఫ్యూజ‌న్ లేకుండా ఆ పార్టీకి పూర్తి మెజార్టీ వ‌చ్చి ఉండేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ వాద‌న‌కు బ‌లం చేకూరేలా గ‌ణాంకాలు క‌నిపిస్తున్నాయి. చాలా త‌క్కువ అధిక్య‌త‌తో దాదాపు 27 స్థానాలు బీజేపీ ప్ర‌త్య‌ర్థుల చేతుల్లోకి వెళ్లిపోయాయి,

ఉదాహ‌ర‌ణ‌కు మ‌స్కీ అసెంబ్లీ స్థానాన్నే తీసుకుంటే బీజేపీ కేవ‌లం 213 ఓట్ల తేడాతో ఆ స్థానంలో ఓట‌మి చెందింది. మ‌స్కీ మాదిరే హిరికెరూర్ స్థానంలో 555 ఓట్ల స్వ‌ల్ప అధిక్య‌త‌లో కాంగ్రెస్ విజ‌యం సాధించింది. అదే స‌మ‌యంలో కుండ్గోల్ లో 634 ఓట్ల తేడాతో బీజేపీ ఓట‌మిపాలైంది. ఇక్క‌డ నోటాకు 1032 ఓట్లు రావ‌టం గ‌మ‌నార్హం. స్వ‌తంత్రులు దాదాపుగా 3వేల ఓట్ల‌ను సాధించ‌టం గ‌మ‌నార్హం. సీఎం సిద్ధ‌రామ‌య్య‌నే తీసుకుంటే ఆయ‌న పోటీ చేసిన చాముండేశ్వ‌రిలో ఓట‌మిపాలు కాగా.. ఆయ‌న బ‌రిలో ఉన్న రెండో నియోజ‌క‌వ‌ర్గ‌మైన బాదామిలో అతి క‌ష్ట‌మ్మీదా 1696 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు.

ఈ తీరులో దాదాపు 27 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అతి స్వ‌ల్ప మెజార్టీతో బీజేపీ ప్ర‌త్య‌ర్థులు విజ‌యం సాధించారు. అతి త‌క్కువ ఓట్ల వ్య‌త్యాసంతో బీజేపీ చేజార్చుకున్న సీట్లు దాదాపు 27 వ‌ర‌కూ ఉన్నాయి. ఇక్క‌డ స్వ‌తంత్రుల‌కు.. నోటాకు వ‌చ్చిన ఓట్ల‌లో స‌గం బీజేపీ ఖాతాలో ప‌డినా.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన సీట్లు వ‌చ్చి ఉండేవ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

త‌క్కువ ఓట్ల వ్య‌త్యాసంలో బీజేపీ ఓడిన కొన్ని స్థానాలు చూస్తే..

+ య‌ల్లాపూర్ 1483
+ గ‌ద‌గ్ 1868
+ శృంగేరి 1989
+ అథాని 2331
+ విజ‌య‌న‌గ‌ర్‌ 2775
+ జ‌మ్ ఖంది 2795
+ యంక‌న్ మ‌ర్ది 2850
+ బ‌ళ్లారి రూర‌ల్ 3129