Begin typing your search above and press return to search.

మోడీ సొంత రాష్ర్టంలో బీహార్ ఫ‌లితాలు

By:  Tupaki Desk   |   28 Nov 2015 7:01 AM GMT
మోడీ సొంత రాష్ర్టంలో బీహార్ ఫ‌లితాలు
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ రాజ‌కీయంగా గ‌డ్డుకాలం ఎదుర‌వుతోందని విశ్లేష‌కులు భావిస్తున్నారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో దుమ్మురేపే విజ‌యం సాధించిన మోడీకి వ‌రుస ప‌రాజయాలు ఎదురైన ప‌రిస్థితే త్వ‌ర‌లో మ‌రోమారు అనుభ‌వంలోకి రానుందా? అది కూడా సొంత రాష్ర్టం గుజరాత్‌ లో ఎదురుకానుందా అనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. మోడీ సొంత రాష్ర్టం గుజ‌రాత్‌ లో జ‌రుగుతున్న స్థానిక సంస్థల ఎన్నిక‌లు ఈ వ్యాఖ్య‌ల‌కు బ‌లం చేకూరుస్తున్నాయి.

గుజ‌రాత్‌ లోని జిల్లా - తాలుక‌ - మున్సిపాలిటీల‌కు రెండు ద‌ఫాలుగా ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగా మొద‌టి విడత‌లో గుజరాత్‌లోని ఆరు మున్సిపల్‌ కార్పొరేషన్లకు వారం క్రితం ఎన్నిక‌లు జరిగాయి. ఆ రాష్ర్టంలోని కీల‌క మున్సిపాలిటీలు అయిన అహ్మదాబాద్‌ - వడోదర - సూరత్‌ - రాజ్‌ కో - భావ్‌ నగర్‌ - జామ్‌ నగర్‌ లకు ఈ ఎన్నికలు నిర్వ‌హించారు. తాజాగా రెండో ద‌శ‌లో 31 జిల్లా పంచాయ‌తీలు - 230 తాలుకాలు - 55 మున్సిపాలిటీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఈ ఎన్నిక‌ల్లో బీజేపీకి ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌తో పాటు రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు కూడా తీవ్రంగా దెబ్బ‌తీసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

గుజ‌రాత్‌ లో ఈ ఏడాది త‌క్కువ వ‌ర్షపాతం న‌మోద‌యింది. దీంతోపాటు పెద్ద ఎత్తున పంట న‌ష్టం సంభ‌వించింది. దీంతో రైతుల్లో తీవ్ర నిరాశ‌లో ఉన్నారు. ఇదే క్ర‌మంలో ధ‌ర‌ల పెరుగుద‌ల సైతం రాష్ర్ట‌ ప్ర‌జ‌ల‌పై పెను భారం మోపింది. వీట‌న్నింటికీ తోడు గుజ‌రాత్‌ లో అత్య‌ధికంగా సాగు చేసే పత్తి - వేరుశ‌న‌గ‌కు అతి త‌క్కువ ధ‌ర ల‌భిస్తోంది. ఇవ‌న్నీ రైతంగంలో తీవ్ర అసంతృప్తికి కార‌ణం అవుతున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్నపుడు గుజరాత్ సీఎం హోదాలో న‌రేంద్ర‌మోడీ తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. గుజ‌రాతీ రైతుల‌పై కేంద్రం స‌వ‌తి త‌ల్లి ప్రేమ చూపిస్తోంద‌ని మండిప‌డ్డారు. అయితే ఇపుడు మోడీ ప్ర‌భుత్వం అదే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని రైతులు పేర్కొంటున్నారు. కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ స‌హాయ మంత్రి గుజ‌రాతీ అయిన‌ప్ప‌టికీ క‌నీస‌మ‌ద్ద‌తు ధ‌ర విష‌యంలో గుజ‌రాత్‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని స్థానికు రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇలా రాష్ర్ట ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త ఓటు బ్యాంకును దెబ్బ‌తీయ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.

మ‌రోవైపు రాజ‌కీయ కార‌ణాలు కూడా బీజేపీ విజ‌యానికి గండికొట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. గుజరాత్‌ లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న పటేల్‌ కుల‌స్తులు 16 శాతంకు పైగా ఓటు బ్యాంకు క‌లిగి ఉన్నారు. చాలాకాలంగా వీరంతా బీజేపీకి మద్దతు పలుకుతున్నారు. అయితే రిజ‌ర్వేష‌న్‌ ల కోసం పటేళ్లు చేప‌ట్టి ఉద్యమాన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నందున ఈసారి ఆ పార్టీని ఘోరంగా ఓడించాలన్న పట్టుదలతో ప‌టేల్‌ కుల‌స్తులు ఉన్నారు. బీజేపీలోని మెజార్టీ ప‌టేల్ నేత‌లు ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున బ‌రిలో దిగారు. ఈ కార‌ణం కూడా బీజేపీ గెలుపును ప్ర‌భావితం చేయ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. మొత్తంగా బీహార్ త‌ర‌హా ఫ‌లితాలు ఎదుర‌వ్వ‌చ్చ‌నే భావ‌న రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.