Begin typing your search above and press return to search.

చంద్రబాబు దగ్గరకొస్తుంటే ఛీఛీ అంటున్న బీజేపీ

By:  Tupaki Desk   |   14 Oct 2019 5:30 AM GMT
చంద్రబాబు దగ్గరకొస్తుంటే ఛీఛీ అంటున్న బీజేపీ
X
దేశవ్యాప్తంగా చాలామంది రాజకీయ నాయకులకు టైం బాగులేదిప్పుడు. మాజీ ప్రధానులు - ముఖ్యమంత్రులు - మాజీ ముఖ్యమంత్రులు - మాజీ కేంద్ర మంత్రులు ఒకరాఇద్దరా వందలాది మందికి బ్యాడ్ టైం నడుస్తోంది. రాహుల్ - సోనియాలు మొదలుకుని కేజ్రీవాల్ - మమత - కుమారస్వామి - మన్మోహన్ - శరద్ పవార్ - ఫరూక్ అబ్దుల్లా - మెహబూబా ముఫ్తీ - చివరకు మన కేసీఆర్ - చంద్రబాబులకూ కూడా బ్యాడ్ టైం నడుస్తోంది. చంద్రబాబు సంగతైతే మరీ దారుణంగా ఉంది. ఒకప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు బంగారం పట్టుకున్నా మట్టిగా మారిపోతుందట. రాజకీయంగా ఆయన ఏ అడుగు వేసినా అది పాతాళలోక మెట్లమార్గంలాగానే మారిపోతుందని చెబుతున్నారు. ఎన్నికల ముందు నుంచి బీజేపీతో కయ్యం పెట్టుకుని దారుణంగా నష్టపోయిన ఆయన ఇప్పుడు ఇంటాబయటా మళ్లీ పూర్వవైభవం సాధించాలన్న తాపత్రయం సిగ్గు విడిచి బీజేపీ దగ్గరగా జరుగుతున్నారు. అయితే, బీజేపీ మాత్రం చంద్రబాబును సమీపంలోకి కూడా రానివ్వడం లేదు. ఆయన బీజేపీకి దగ్గరవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే ఏపీ బీజేపీ నాయకులు మాత్రం చంద్రబాబుపై తమ ఆరోపణల జోరును పెంచుతున్నారు. అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వంపై కంటే కూడా వారు చంద్రబాబుపైనే మాటల దాడికి దిగుతున్నారు.

తాజాగా ఏపీ బీజేపీ నేతలు చంద్రబాబుపై మండిపడ్డారు. అమరావతి పేరుతో వేల కోట్లు దోచుకున్నారని - పోలవరం టెండర్లలో కమీషన్లు తీసుకున్నారని బీజేపీ నేతలు బాబుపై విమర్శలు గుప్పించారు. తెలుగుదేశంతో పొత్తు కారణంగానే రాష్ట్రంలో బీజేపీ నష్టపోయిందని - దశాబ్దాలుగా కమలం పార్టీ ఎదగకుండా చంద్రబాబు అడ్డుకుంటూ వచ్చారని విమర్శలు చేశారు. ఇప్పటి వరకూ ఉప్పూ నిప్పుగా ఉన్న బీజేపీ - టీడీపీ మళ్లీ మైత్రిబంధం కలవనుందా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆ ఊహాగానాలకు తెరదించుతూ వారు చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు.

ఇటీవల విశాఖ పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేంద్రంతో విభేధించి నష్టపోయామని - పట్టుదలకు పోకుండా ఉంటే అంత ఇబ్బందులు వచ్చేవి కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్రంతో సఖ్యత లేకపోవడంతో రాష్ట్రానికి లాభం జరగలేదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. పవన్‌తో హుందాగా ఉండాలనే గాజువాకలో ఎన్నికల ప్రచారానికి రాలేదన్నారు. ఆయనతో లాలూచీ వ్యవహారాలు ఏం లేవని వ్యాఖ్యానించారు. బీజేపీ, జనసేనను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. ఆ నేపథ్యంలోనే బీజేపీ నేతలు చంద్రబాబు రాజకీయాలు తమపై అనుమానాలు పెంచకుండా ఉండేందుకు గాను ఆయన్ను కొన్నాళ్ల పాటు టార్గెట్ చేసి చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లాలనుకుంటున్నారట.