Begin typing your search above and press return to search.

బీజేపీ ప‌క్కా వ్యూహం!... బాబుకు బ్యాండే!

By:  Tupaki Desk   |   14 Feb 2018 3:30 PM GMT
బీజేపీ ప‌క్కా వ్యూహం!... బాబుకు బ్యాండే!
X
ఏపీలో అధికార పార్టీ టీడీపీకి దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంద‌న్న వాద‌నే వినిపిస్తోంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో లెక్క లేన‌న్ని హామీలు ఇవ్వ‌డంతో పాటుగా రైతుల రుణాల మాఫీ మాట చెప్పేసిన చంద్ర‌బాబు... అప్ప‌టిదాకా వైసీపీ అదినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైపు వీస్తున్న గాలిని త‌న వైపున‌కు తిప్పేసుకున్నారు. చిన్న మార్జిన్ల‌తోనే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న చంద్ర‌బాబు ఎట్ట‌కేల‌కు అధికారంలోకి వ‌చ్చేశారు. ఆ వెంట‌నే 13 జిల్లాల‌తో ఓ ముక్క‌గా ఏర్ప‌డ్డ న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ కు సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన చంద్రబాబు... పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేయ‌డంతో పాటుగా నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తికి ఓ రూపు తీసుకొస్తాన‌ని, ఆ త‌ర్వాతే ఎన్నిక‌ల‌కు వ‌స్తాన‌ని చెప్పుకొచ్చారు. చంద్ర‌బాబు మాదిరిగానే... ఈ రెండు విష‌యాల్లో వెన‌క్కు త‌గ్గేదే లేద‌ని చెప్పేసిన తెలుగు త‌మ్ముళ్లు కూడా ఈ రెండు పూర్తి చేస్తేనే త‌మ‌కు ఓట్లేయండంటూ ఘ‌నంగానే ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. ఇప్పుడు ఈ రెండు విష‌యాల్లో ఏమాత్రం పురోగ‌తి ఉంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అమ‌రావ‌తి నిర్మాణంలో ఇప్ప‌టిదాకా శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న‌ సింగిల్ ఇటుక కూడా ప‌డ‌లేదు. నాలుగేళ్ల‌లో కేవ‌లం రెండంటే రెండు నిర్మాణాలు మాత్ర‌మే అమ‌రావ‌తిలో క‌నిపిస్తుండ‌గా, అవి రెండు కూడా తాత్కాలిక ప్రాతిప‌దిక‌న క‌ట్టిన‌వే. ఇక పోల‌వ‌రం ప్రాజెక్టును 2018లోగా పూర్తి చేస్తామ‌ని టీడీపీ స‌ర్కారు చెబితే... 2019లో కూడా ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేలా క‌నిపించ‌డం లేదు. మొత్తంగా టీడీపీ నేత‌లు ఘ‌నంగా ప్ర‌క‌టించిన ఈ రెండు అంశాల్లోనూ అనుకున్న ల‌క్ష్యాలు సిద్ధించ‌లేద‌నే చెప్పాలి.

ఇక టీడీపీ స‌ర్కారు ఈ మాట‌లు చెప్పి ఇప్ప‌టికే నాలుగేళ్లు పూర్తి కావ‌స్తోంది. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌రి రేపు ఎన్నిక‌ల‌కు వెళితే... ఈ రెండు విష‌యాల‌పై చంద్రబాబు అండ్ కో ఏ మాట చెబుతార‌న్న‌దే ఇప్పుడు అస‌లు సిస‌లు ప్ర‌శ్న‌. అస‌లు అమ‌రావ‌తి నిర్మాణం పూర్తి కాకుండా, పోల‌వ‌రం ప్రాజెక్టును నిర్మించ‌కుండా ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌మ‌స్యే లేద‌ని చెప్పిన టీడీపీ నేత‌లు... ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం ప్ర‌జ‌ల ముందుకు వెళ‌తార‌న్న ప్ర‌శ్న ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటు రాజ‌ధానికి ఓ రూపు రాకుండా, పోల‌వ‌రం ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితులు ఉంటే.. టీడీపీ నేత‌లు వచ్చే ఎన్నిక‌ల్లో జ‌నానికి ఏం చెబుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అయినా టీడీపీకి ఎదుర‌వుతున్న ఈ త‌ర‌హా ఇబ్బంది వెనుక బీజేపీ వ్యూహం కూడా ప‌క్కాగానే ప‌నిచేస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దేమో. రాజ‌దాని నిర్మాణానికి శంకుస్థాపన‌కు వ‌చ్చిన స‌మ‌యంలో ఓ చెంబు గంగా జ‌లం - ఓ పిడికెడు మ‌ట్టి తీసుకువ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ... ముందుగా హామీ ఇచ్చిన మేర‌కు అమ‌రావ‌తి నిర్మాణానికి నిధులు విడుద‌ల చేశారు. రాజ‌ధానిలో రాజ్ భ‌వ‌న్‌ - సెక్ర‌టేరియ‌ట్‌ - అసెంబ్లీ - హైకోర్టుల‌కు మాత్రమే కేంద్రం నిధులు ఇస్తుంద‌న్న విష‌యం తెలిసిందే క‌దా. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే రూ.1500 కోట్ల‌ను విడుద‌ల చేసిన మోదీ... ఆ నిధులు ఎక్క‌డెక్క‌డ ఖ‌ర్చు పెట్టారో చెప్ప‌డంతో పాటుగా యుటిలైజేష‌న్ స‌ర్టిఫికెట్లు ఇస్తే మ‌లి విడ‌త నిధులు ఇస్తామ‌ని చెబుతున్నారు. తాత్కాలిక నిర్మాణాల‌కే వంద‌ల కోట్ల‌ను త‌గ‌లేసిన చంద్ర‌బాబు స‌ర్కారు... వాటికి లెక్క‌లు చెప్పేందుకు స‌సేమిరా అంటున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఇలాగైతే కుద‌ర‌ద‌ని భావించిన బీజేపీ... ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు అనుగుణంగానే ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్న‌ట్లుగా తెలుస్తోంది. అస‌లు విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాల మేర‌కు ఏపీకి సాయం మాట ఇప్ప‌టికిప్పుడు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతూనే.. 2020లోగా పూర్తి స్థాయిలో సాయం చేసే వీలుంద‌ని చెబుతోంది. అంటే పోల‌వ‌రం ప్రాజెక్టుకు కూడా ఇప్ప‌టికిప్పుడు పూర్తి స్థాయిలో నిధులు ఇచ్చేది లేద‌ని బీజేపీ స‌ర్కారు తెగేసి చెప్పిన‌ట్లుగానే భావించ‌క త‌ప్ప‌దేమో. ఇప్ప‌టికే పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో జ‌రుగుతున్న జాప్యానికి కేంద్ర స‌ర్కారు నిధుల విడుద‌ల‌లో చేస్తున్న జాప్య‌మే కార‌ణ‌మని చెబుతున్న చంద్ర‌బాబు స‌ర్కారు... తాజాగా బీజేపీ నేత‌ల నోట వినిపిస్తున్న మాట‌ల‌తో క‌క్క‌లేక మింగ‌లేక అయోమ‌యంలో ప‌డిపోయింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. నిన్న మీడియా ముఖంగా విభ‌జ‌న విష‌యాల‌ను పూర్తిగా విప్పేసిన బీజేపీ నేత‌ - ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు... ఇదే మాట‌ను ప‌దే ప‌దే వినిపించారు. అంటే అటు పోల‌వ‌రం ప్రాజెక్టుకు గానీ, ఇటు అమ‌రావ‌తి నిర్మాణానికి గానీ యుటిలైజేష‌న్ స‌ర్టిఫికెట్లు ఇచ్చేదాకా మ‌లివిడ‌త నిధులు ఇచ్చేది లేద‌ని తేల్చి చెప్పిన‌ట్లుగా భావించాలి. అంతేకాకుండా యుటిలైజేష‌న్ స‌ర్టిఫికెట్లు ఇచ్చినా కూడా 2020లోగా పూర్తి స్థాయి సాయం చేస్తామ‌న్న మాట‌తో... అటు పోల‌వ‌రంతో పాటు ఇటు అమ‌రావ‌తికి కూడా నిధుల విడుద‌ల‌లో మ‌రింత జాప్యం త‌ప్ప‌ద‌ని కూడా మోదీ స‌ర్కారు మాట‌గా వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లే చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. బీజేపీ ర‌చించిన వ్యూహం ప్ర‌కారమే వీర్రాజు నిన్న మీడియా ముందు 2020 మాట చెప్పార‌ని, తద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు బ్రేకులు ప‌డ‌టం ఖాయ‌మేన‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.