Begin typing your search above and press return to search.

ఫుల్ మెజారిటీ రాకూడదు.. బీజేపీలోని పెద్ద కోరిక!

By:  Tupaki Desk   |   21 April 2019 2:30 PM GMT
ఫుల్ మెజారిటీ రాకూడదు.. బీజేపీలోని పెద్ద కోరిక!
X
గత ఎన్నికల ముందు సంచలన స్థాయి విజయంతో భారీగా సీట్లను నెగ్గినందుకు భారతీయ జనతా పార్టీ నేతలు మొదట్లో ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు కానీ, తమ పార్టీలోనే ఏకవ్యక్తి స్వామ్యంతో వారే ఒకింత విసిగిపోయారనే అభిప్రాయాలున్నాయి. ఫుల్ మెజారిటీ రావడంతో.. తామేం చేసినా తిరుగులేదు అనే పరిస్థితి వచ్చింది బీజేపీ నేతలకు. ఆ పరిస్థితి ఎక్కడి వరకూ వెళ్లిందంటే వ్యక్తిస్వామ్యం లేదనుకునే బీజేపీలో మోడీ తిరుగులేని శక్తిగా మారారు.

మోడీకి తోడు అనుంగు అమిత్ షా కలిసి పార్టీని - ప్రభుత్వాన్ని తమ కనుసన్నల్లో నడిపించారనే పేరు వచ్చింది.వారి ముందు సీనియర్ నేతలే వెలవెలబోయిన వైనం అంతా గమనించారు కూడా. అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్లు ప్రభను కోల్పోయారు. అప్రాధాన్యంలోకి వెళ్లిపోయారు. వారికి ఈ సారి రిటైర్మెంటే ఇచ్చారు మోడీ - అమిత్ షాలు.. అనేది చాలా మంది చేసిన విశ్లేషణ.

వారి సంగతే అలా ఉంటే.. పార్టీలో మోడీకి సమస్థాయి నేతలు - మోడీ కన్నా ముందే పార్టీలో ఒక వెలుగు వెలిగిన వారు - మోడీ కన్నా మునుపే కేంద్రంలో కీలకమైన బాధ్యతలు చూసిన నేతలు.. వాళ్లంతా.. మోడీ హయాంలో మరింత వెనుకబడి పోయారు. వారు కేవలం నామమాత్రంగా మిగిలారు. వారికంటూ మంత్రి పదవులూ గట్రా ఉన్నా.. స్వతంత్రంగా దేన్నీ నిర్ణయించలేని పరిస్థితి. ఇలా ఐదేళ్లు నెట్టుకొచ్చారు.

అయితే ఎవరూ బయటపడలేదు. మోడీ - అమిత్ షా కనుసన్నల్లో మొత్తం వ్యవహారాలు అన్నీ నడుస్తూ వచ్చాయి. ఫలితంగా వారంతా ఒక రకంగా డమ్మీలు అయిపోయారు. అధికారం ఉన్నా అలాంటి అసహనం అయితే సదరు నేతల్లో ఉండిందంటారు. అందుకే ఈ సారి తమ పార్టీ గెలుపు అంచుల వరకూ రావాలి కానీ - తమకే పూర్తి మెజారిటీ రాకూడదని.. మోడీ - షా హవాకు బ్రేకులు పడాలని వారే కోరుకుంటూ ఉన్నారట. బోటాబోటీ మెజారిటీకి దగ్గరగా వచ్చి - వేరే పార్టీల మద్దతు కలిసి వచ్చి తమ కూటమి ప్రభుత్వం ఏర్పడినట్టుగా అయితే.. అప్పుడు పార్టీలో ఏకస్వామ్యం పోతుందని - తమలాంటి వారి చేతికి కూడా కాస్త పవర్స్ వస్తాయని - మెజారిటీకి దగ్గరగా వచ్చి ఇతర పార్టీల మీద ఆధారపడే పరిస్థితే వస్తే.. అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కూడా తమబోటి సీనియర్లకు దక్కవచ్చనే ఆశ కూడా ఉందట సదరు నేతలకు. ఎవరూ బయటపడటం లేదు కానీ.. తమకు ల్యాండ్ స్లైడ్ విక్టరీ అక్కర్లేదని - తమ పార్టీలో సూపర్ పవర్ ల హవాను తగ్గించే స్థాయిలో సీట్లు దక్కాలని వారు కోరుకుంటున్నట్టుగా భోగట్టా!