Begin typing your search above and press return to search.

కంచె ఐలయ్య బీజేపీకి మేలు చేసినట్లేనా...?

By:  Tupaki Desk   |   13 Sep 2017 11:30 PM GMT
కంచె ఐలయ్య బీజేపీకి మేలు చేసినట్లేనా...?
X
బీజేపీ భావజాలానికి, కంచె ఐలయ్యకు ఎక్కడా పొసగదు. కానీ... కంచె ఐలయ్య మాత్రం తెలుగు రాష్ఱ్టాల్లో బీజేపీకి పరోక్షంగా పెద్ద మేలు చేసినట్లే కనిపిస్తోంది. వైశ్యులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన రాసిన తాజా పుస్తకం పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. వైశ్యులు దీనిపై తీవ్ర స్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు. తెలుగు రాష్ఱ్టాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ వివాదానికి దూరంగా ఉంటూ ఆచితూచి అంతా పరిశీలిస్తున్న సమయంలో బీజేపీ నేతలు మాత్రం ఒక్కసారిగా ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా తిప్పుకొనేందుకు రంగంలోకి దిగారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ నేతలు నేరుగా వైశ్యుల పక్షం వహిస్తూ ఐలయ్యపై మండిపడుతున్నారు. ఐలయ్యను కేసీఆర్ ప్రభుత్వం శిక్షించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి - బీజేపీ నేత మాణిక్యాలరావు ఈ వివాదంపై స్పందిస్తూ ఐలయ్య ఆర్యవైశ్యులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక కులాన్ని కించ‌ప‌రచే హ‌క్కు ఎవ‌రికీ లేదని అన్నారు. ఐల‌య్య రాసిన ఆ పుస్తకాన్ని నిషేధించాల‌ని కోరారు. అలాగే మరో బీజేపీ నేత - ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా ఫైరయ్యారు. ఐలయ్యను ఆయన జాతి వ్యతిరేక శక్తిగా అభివర్ణించారు. ఆయన్ని కేసీఆర్ ప్రభుత్వం చట్టబద్ధంగా శిక్షించాలని వీర్రాజు డిమాండ్ చేశారు.

కాగా రెండు రాష్ర్టాల్లోనూ వైశ్యులు లేని నియోజకవర్గమంటూ లేదు. ఏపీలో అయితే, మొన్నటి నంద్యాల ఎన్నిక సమయంలో వైశ్యులు టీడీపీకి దూరమయ్యారు కూడా. అలాగే తెలంగాణలోనూ వారు తటస్థంగానే ఉన్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ నేతలు వారి పక్షం వహించి మార్కులు కొట్టేస్తున్నారు. టీడీపీ - వైసీపీ - టీఆరెస్ మాదిరిగా తెలుగు రాష్ఱ్టాల్లో ప్రత్యేకించి సామాజికవర్గ ఓటు బ్యాంకు లేని బీజేపీ ఇప్పుడు ఆ లోటను వైశ్యులతో భర్తీ చేసుకునేందుకు బాగానే ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

అయితే... ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా గాంధీ పేరు ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వైశ్యులు బీజేపీ నేతలను ఎంతవరకు విశ్వసిస్తారన్నది చూడాలి.