Begin typing your search above and press return to search.

కమలం చేతిలో సై 'కిల్' తప్పదా...!?

By:  Tupaki Desk   |   20 Sep 2018 4:18 PM GMT
కమలం చేతిలో సై కిల్ తప్పదా...!?
X
నాలుగేళ్లు బాగానే ఉన్నారు. చిరునవ్వులు చిందించారు. కౌగలించుకున్నారు. దేశానికి తామే దిశానిర్దేశం చేస్తున్నామన్నారు. ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్‌ గా మార్చేందుకు కష్టపడుతున్నామంటే.... ఆ కష్టానికి తమ వంతే సాయం చేసి చేయూతనిస్తామని మరొకరు చెప్పారు. రెండు పార్టీల నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీయటి తాయిలాలు రుచి చూపించారు. నాలుగేళ్ల తర్వాత మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. వీరి వైరానికి కారణం ప్రత్యేక హోదా అనే బ్రహ్మ పదార్దమే కావడం విశేషం. ఇంత చదివిన తర్వాత ఆ రెండు పార్టీలు ఏవో... ఆ నాయకులు ఎవరో ఈపాటికి తెలిసే ఉంటుంది. అవును... వారే.... ఆ నాయకులే... ఆ పార్టీలే...ఇందులో ఒకటి భారతీయ జనతా పార్టీ అయితే.... మరొకటి ఆంధ్రప్రదేశ్‌ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇది కోల్డ్ వార్ కాదు.. బహిరంగ యుద్ధమే. తెలుగు దంగల్. ఏ మాత్రం అవకాశం వచ్చినా తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడుతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు.

దీనికి జాతీయ నాయకులు - రాష్ట్ర నాయకులే అనే తేడా లేదు. తమ కమలనాథులతో తెలుగుదేశం పార్టీ సై "కిల్" చేయాలన్నదనే అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే అవకాశం వచ్చినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగుదేశంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర శాఖ కార్యవర్గ సమావేశంలో కూడా తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డారు. గురువారం నాడు తూర్పు గోదావరి జిల్లా కాకిపాడలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఎక్కువ సమయాన్ని తెలుగుదేశం పార్టీపై విమర్శలకే కేటాయించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక దందాతో తెలుగుదేశం నాయకులు కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో పెట్టిన రాజకీయ తీర్మానంలో తాము ఎలాంటి రాజకీయ ప్రాధాన్యతతో ముందుకు వెళ్లాలో నిర్ణయించుకోకుండా తెలుగుదేశం పార్టీ వినాశానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలో తీర్మానంలో పొందుపరచడం వారి వ్యతిరేకతకు సాక్ష్యంగా నిలుస్తోంది. చంద్రబాబు నాయుడి ఏలికలో సాగునీటి ప్రాజెక్టులు ముందుకు కదలడం లేదని, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్రం ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదని విమర్శలు గుప్పించారు. వీటి కంటే కీలకాంశం పాల డెయిరీల పరిస్ధితి. ఆంధ్రప్రదేశ్‌ లో పాల డైరీలన్నీ దాదాపు మూత పడే పరిస్ధితి ఉంటే.... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజీ డైరీ మాత్రం లాభాల్లో ఉందంటూ విమర్శించారు. ఇది ఎలా సాధ్యం అని కూడా భారతీయ జనతా పార్టీ తన కార్యవర్గ సమావేశంలో చర్చించడం విశేషం. ఇక ఆంధ్రప్రదేశ్‌ లో పెట్రోలు ధరలు పెరుగుదలకు చంద్రబాబు నాయుడు విధించిన పన్నులే కారణమనే అంశాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వంపై ఎక్కుపెట్టారు భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇలా తమ విమర్శలతో తెలుగుదేశం పార్టీని గుక్క తిప్నుకోకుండా చేయాలన్న భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని రాష్ట్ర కమలనాథులు తూ.చా.తప్పక పాటించడం గమనార్హం.