Begin typing your search above and press return to search.

బాబు, వెంక‌య్య‌...ఓ ఫిర్యాదు

By:  Tupaki Desk   |   10 Feb 2016 9:28 AM GMT
బాబు, వెంక‌య్య‌...ఓ ఫిర్యాదు
X
మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న తెలుగుదేశం - బీజేపీల మ‌ధ్య పొర‌పొచ్చాలు ప్రారంభ‌మ‌వుతున్నాయా? ఒక్కొక్క అంశంగా తాము ప‌డుతున్న ఇబ్బందుల‌ను ఏక‌రువు పెట్టేందుకు క‌మ‌ళ‌నాథులు రెడీ అయిపోయారా? ఇందుకోసం ఏకంగా నివేదిక రెడీ చేసి పెట్టారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

భారతీయ జనతా పార్టీ-తెలుగుదేశం అధికారం పంచుకుంటున్నఆంధ్ర‌ప్రదేశ్‌ లో ఈ త‌ర‌హా ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి సిద్ధ‌మైన పార్టీ నేత‌లు ఏకంగా ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు అంశంగా చీలిపోతున్న‌ట్లు స‌మాచారం. ఇరు పార్టీల‌కు పెద్ద‌దిక్కుగా చంద్రబాబునాయుడు - వెంకయ్య నాయుడుల మధ్య ఉన్న సాన్నిహిత్యం కార‌ణంగా వాస్త‌వాల‌ను చ‌ర్చించుకునే అవ‌కాశం లేద‌ని ప‌లువురు బీజేపీ నేత‌లు భావిస్తున్నారు. రైతు రుణమాఫీ - రాజధాని రైతులకు ప్యాకేజీ - రిజర్వేషన్ల రగడ - ఎన్నికల హామీలు అమలు చేయకపోవడం వంటి పలు అంశాలతో అధికార టీడీపీ ప్రభుత్వం వ్యతిరేకతను మూటకట్టుకుంద‌ని ఈ అసంతృప్త‌ బీజేపీ నేత‌లు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్రజల గ‌ళాన్ని వినిపించ‌కుండా కొంద‌రు బీజేపీ నేత‌లు కావాల‌నే బీజేపీ అధిష్టానాన్ని త‌ప్పుదోవ‌ప‌ట్టిస్తున్న‌ట్లు వీరు భావిస్తూ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు నివేదిక రెడీ చేసిన‌ట్లు స‌మాచారం.

రాష్ట్రంలో మోడీ పథకాలను నీరుగారుస్తున్నారని, బీజేపీ నాయకులను అభివృద్ధిలో భాగస్వాములను చేయడం లేదని ఈ నివేదిక‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్‌ చైర్మన్ ల వంటి నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో కూడా బీజేపీకి మొండి చెయ్యి చూపుతున్నారని అసంతృప్తితో ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కొందరు అధికార పార్టీ నేతలు ఉద్దేశ‌పూర్వ‌కంగా వ్యాఖ్యానిస్తున్నారని పేర్కొంటూ ఇదే విధానం కొనసాగితే మరో మూడేళ్లు టీడీపీ కలిసి ఉండటం ఎలా అని నివేదిక‌లో ప్ర‌స్తావించారు. తెలుగుదేశం ప్ర‌భుత్వంలో తామూ భాగ‌స్వామ్యుల‌మ‌నే భావ‌న రావ‌డంతో పాటు పార్టీ ఎదిగేందుకు స‌హ‌క‌రించాల‌నే దిశ‌గా ఆయా నేత‌లు రిపోర్ట్‌ ను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ముచ్చ‌టించి దోస్తీ కుదిర్చుకొచ్చిన స‌మ‌యంలోనే ఈ ఇబ్బందిక‌ర ప‌రిణామం ఏమిటంటూ ప‌లువురు మిత్ర‌ప‌క్షాల అభిమానులు వాపోతున్నారు.