Begin typing your search above and press return to search.

బాల‌య్య ఇంటిపై అటాక్‌

By:  Tupaki Desk   |   21 April 2018 1:48 PM GMT
బాల‌య్య ఇంటిపై అటాక్‌
X
రాజ‌కీయాల్లో గాని - సినిమాల్లో గాని బాల‌య్య వివాదాల‌పై స్పందించేది త‌క్కువ‌. ఆయ‌న మాట‌లు వివాదాస్ప‌దం అవుతుంటాయి. కానీ ఆయ‌న వివాదాల్లో సాధార‌ణంగా దూరరు. అయితే, నిన్న ఏపీలో ముఖ్య‌మంత్రి నిర్వ‌హించిన ధ‌ర్మ పోరాట దీక్ష‌లో హిందూపురం ఎమ్మెల్యే అయిన బాల‌య్య పాల్గొన్నారు. ఆ సంద‌ర్భంగా ఏపీకి అన్యాయం చేసిన న‌రేంద్ర‌మోడీని త‌న‌దైన శైలిలో విమ‌ర్శించారు. *ప్రధాని న‌రేంద్ర‌మోడీ శిఖండిలా - కొజ్జాలా రాజకీయాలు చేస్తున్నార‌ని, వ‌చ్చే ఎన్నికల్లో ఆ కుట్ర‌ల‌తోనే గెలవాలనుకుంటున్నారు. నేను చెప్తున్నా ఏం చేసినా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు అని బాల‌కృష్ణ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై బీజేపీ నేత‌లు తీవ్రంగా మండిప‌డుతున్నారు.

ఇదిలా ఉండ‌గా హైద‌రాబాదు-తెలంగాణ ప్రాంతంలో కూడా బాలకృష్ణ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌లు మండిప‌డ్డారు. ఈరోజు భాజ‌పా యువ మోర్చా ఏకంగా బాల‌య్య ఇంటినే టార్గెట్ చేసింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెలకొంది. ప్రధానమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు శనివారం జూబ్లీహిల్స్‌లో ఉన్న బాల‌య్య‌ ఇంటిని ముట్టడించారు. వెంట‌నే ప్ర‌ధాన మంత్రిపై చేసిన వ్యాఖ్య‌లు ఉప‌సంహ‌రించుకుని, ఆయ‌న బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బాలయ్య ఇంటి ముందు కూర్చుని ధ‌ర్నా చేశారు. బాల‌కృష్ణ‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్ప‌టికి ఆయ‌న ఇంట్లో లేరు.

కొద్దిసేప‌టి త‌ర్వాత బాలకృష్ణ ఇంటికి రాగా ఆయ‌న‌ వాహనాన్ని అడ్డుకున్న కార్యకర్తలు, మోడీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అప్ప‌టికే అక్క‌డికి చేరుకున్న పోలీసులు బాల‌కృష్ణ‌ను ఇంట్లోకి తీసుకెళ్లిపోయారు. ఈ సందర్భంగా పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

బాల‌య్య మాట్లాడితే ఆప‌డం క‌ష్టం. నిన్న కూడా దీక్ష లో తాను తొడ‌గొట్టి మ‌రీ మాట్లాడారు. ఏపీకి అన్యాయం చేసినందుకు బంక‌ర్ల‌లో దాక్కున్నా వ‌దిలిపెట్టేది లేద‌ని సీరియ‌స్ వార్నింగ్ ఇవ్వ‌డం వివాదానికి దారితీసింది. బాల‌య్య మాట‌లే కాదు, కోట్ల‌ ఖ‌ర్చుతో త‌ల‌పెట్టిన దీక్ష కూడా వివాదాస్ప‌ద‌మే అయ్యింది.