Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు షాక్.. ఇద్దరు ఎంపీలు బీజేపీలోకా?

By:  Tupaki Desk   |   13 Jun 2019 4:56 AM GMT
కాంగ్రెస్ కు షాక్.. ఇద్దరు ఎంపీలు బీజేపీలోకా?
X
గోరుచుట్టపై రోకలిపోటు అంటే ఇదేనేమో.. ఓ వైపు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. మరోవైపు కేంద్రంలోని బీజేపీ.. ఇప్పుడు తెలంగాణలో ఆపరేషన్ కాంగ్రెస్ కు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో సీఎల్పీ విలీనాన్ని కూడా పూర్తి చేశారు.

ఇప్పుడు బీజేపీ వంతు వచ్చేసింది. తెలుగు రాష్ట్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన బీజేపీ ఏపీ - తెలంగాణలో 2024 వరకు బలం పుంజుకోవాలని స్కెచ్ గీస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 4 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలవడంతో బీజేపీ అధిష్టానం బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ను రంగంలోకి దింపినట్టుగా సమాచారం.

తెలంగాణలో ఇప్పటికే టీఆర్ ఎస్ దెబ్బకు కుదేలైన కాంగ్రెస్ ను మరింత దెబ్బకొట్టడానికి బీజేపీ రెడీ అయినట్లు తెలుస్తోంది. తాజాగా ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి - కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కలిసినట్లు ప్రచారం సాగుతోంది. వీరితోపాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి - కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు - మాజీ ఎంపీ వివేక్ లు కలిసి చర్చలు జరిపారని సమాచారం.

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో తీసికట్టుగా తయారైంది. ఆ పార్టీ 2024లో కూడా అధికారంలోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. కేసీఆర్ వ్యూహాలు - పథకాలతో ఇప్పటికే చాలా మంది టీఆర్ ఎస్ లో చేరిపోయారు. వచ్చే ఎన్నికల నాటికి మరింత బలంగా గెలవడానికి కేసీఆర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. అందుకే కాంగ్రెస్ లో ఉంటే కష్టమని భావించి.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు సదురు కాంగ్రెస్ నేతలు చూస్తున్నట్టు సమాచారం.వీరంతా బీజేపీలో చేరడానికి చర్చలు జరిపినట్టు సమాచారం. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీని మరింత కృంగదీయడం ఖాయం. ఇదేగానీ జరిగితే కాంగ్రెస్ ఖేల్ ఖతమయ్యేలానే ఉంది.

అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం రేవంత్ లేదా కోమటిరెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని చేస్తేనే వారు బీజేపీలో చేరుతామని కండీషన్ పెట్టినట్టు తెలిసింది. దీనిపై బీజేపీ అధిష్టానంతో మాట్లాడి రాంమాధవ్ క్లారిటీ ఇస్తానన్నట్టు సమాచారం. అయితే బీజేపీలో చేరుతున్నామన్న వార్తలను సదురు కాంగ్రెస్ ఎంపీలు - నేతలు ఖండించారు.