తూచ్..గవర్నరు పిలుపు ట్వీట్ డిలీట్ చేసిన బీజేపీ

Wed May 16 2018 23:05:38 GMT+0530 (IST)

ఇప్పటికే మోదీ-షా రాజకీయంతో వరుస దెబ్బలు తింటున్న కాంగ్రెస్ పార్టీకి కొద్దిసేపటి కిందట బీజేపీ కర్ణాటక శాఖ చేసిన ట్వీట్ మరింత భయపెట్టింది. యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నరు ఆహ్వానించారని.. రేపు ఉదయం యడ్డీ ప్రమాణ స్వీకారం చేస్తారన్నది ఆ ట్వీట్ సారాంశం. దీంతో కాంగ్రెస్ గగ్గోలు పెట్టింది. దీంతో కర్ణాటక బీజేపీ శాఖ తన అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ఆ ట్వీట్ కొద్దిసేపటి కిందట తొలగించింది.
    
యడ్యూరప్ప రేపు ఉదయం ప్రమాణ స్వీకారం చేస్తారని కర్ణాటక బీజేపీ ట్వీట్ చేసినప్పటికీ గవర్నరు నుంచి మాత్రం దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఇది చర్చనీయంగా మారింది. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కాంగ్రెస్ సహకారంతో ప్రభుత్వ ఏర్పాటుకు తమకు తగినంత బలం ఉందంటూ కుమారస్వామి గవర్నరుకు తెలపడంతో ఆయన్నే పిలవాలన్న వాదన వినిపిస్తోంది.
    
ఈ నేపథ్యంలోనే కర్ణాటక బీజేపీ వెంటనే తన ట్వీట్ ను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ట్వీట్ లో ఉన్నట్లే జరిగే అవకాశాలున్నప్పటికీ గవర్నరు నుంచి అధికారిక ప్రకటన వెలువడకుండా వారు ట్వీట్ చేయడంతో బీజేపీ దిల్లీ పెద్దలు వారించినట్లుగా సమాచారం.
    
మరోవైపు గవర్నరు వాజూభాయి 1996లో గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రధానిగా ఉన్న దేవెగౌడ అప్పటి గుజరాత్ బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయడం.. ఇప్పుడు దేవెగౌడ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వాజూభాయే కర్ణాటక గవర్నరుగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్న నేపథ్యంలోనూ బీజేపీ కాస్త ఆచితూచి అడుగులేస్తోంది.