Begin typing your search above and press return to search.

మోదీకి భారీ ఎదురు దెబ్బ త‌గిలిందే!

By:  Tupaki Desk   |   21 March 2018 10:44 AM GMT
మోదీకి భారీ ఎదురు దెబ్బ త‌గిలిందే!
X
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి నేతృత్వం వ‌హిస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఇప్పుడు పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింద‌నే చెప్పాలి. ఈ దెబ్బ బీజేపీ కంటే ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా - ప్ర‌ధాని న‌రేంద్ర మోదీల‌కు త‌గిలిన అతి పెద్ద ఎదురు దెబ్బ‌గానే చెప్పాలి. బీజేపీ ఐటీ సెల్ వ్య‌వ‌స్థాప‌కుడు - పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడు ప్ర‌ద్యుత్ బోరా... పార్టీని పూర్తిగా వీడిపోయారు. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీ జాతీయ క‌మిటీ స‌భ్య‌త్వంతో పాటుగా పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి కూడా బోరా రాజీనామా చేసి పారేశారు. ఈ మేర‌కు తాను ఎందుకు రాజీనామా చేస్తున్నాన‌న్న విష‌యాన్ని వివ‌రిస్తూ బోరా... ఓ నాలుగు పేజీల లేఖ‌ను పార్టీ జాతీయ అధ్య‌క్షుడి హోదాలో ఉన్న అమిత్ షాకు పంపారు. ప్ర‌స్తుతం బోరా రాజీనామా వ్వ‌వ‌హారం పార్టీలో పెద్ద చ‌ర్చ‌కే తెర తీసింద‌ని చెప్పాలి.

అస‌లు బోరా పార్టీలో ఎలా ఎదిగార‌న్న విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం 40 ఏళ్ల వ‌య‌సు ఉన్న బోరా అసోంకు చెందిన యువ రాజ‌కీయ వేత్త‌. 2004లో బీజేపీలో చేరిన ఆయ‌న పార్టీకి సంబంధించి ఐటీ సెల్ ను స్థాపించారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో మోదీ ప్ర‌చారం హోరెత్త‌డంలో ఈ సెల్ కీల‌క భూమిక పోషించింది. పేరుకు మొత్తం ప్ర‌చార‌మంతా రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ ప‌ర్య‌వేక్షించినా... బీజేపీ ప్ర‌చారాన్ని ప‌తాక స్థాయికి తీసుకెళ్ల‌డంలో బోరా నేతృత్వంలో పురుడు పోసుకున్న బీజేపీ ఐటీ సెల్ కీల‌క భూమిక పోషించింద‌ని పార్టీ వ‌ర్గాల స‌మాచారం. ఇంత‌టి ప్రాధాన్య‌మున్న బోరా... ఉన్న‌ట్టుండి పార్టీకి రాజీనామా చేసేశారు. అంతేకాకుండా రాజీనామా లేఖ‌ను అమిత్ షాకు పంపిన త‌ర్వాత నేటి ఉద‌యం మీడియా ముందుకు వ‌చ్చిన ఆయ‌న బీజేపీ - మోదీ - అమిత్ షాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

2004లో తాను చేరిన బీజేపీ... ప్రస్తుత బీజేపీకి అస‌లు పొంత‌నే లేద‌ని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు పార్టీలో స‌మాన‌త్వ‌మే లేద‌ని కూడా ఘాటు వ్యాఖ్య‌లు చేసిన బోరా... స‌మానత్వం పాటించ‌ని వ్య‌క్తుల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీనే ప్ర‌థ‌ముడిగా నిలుస్తున్నార‌ని ఆయ‌న మ‌రింత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇక పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా ఎన్నికైన త‌ర్వాత అమిత్ షా త‌న‌దైన శైలి దుందుడుకు వైఖ‌రితో వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌లెట్టార‌ని, ఆయ‌న‌ను చూసి పార్టీలోని కింది స్థాయి నేత‌లు కూడా దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌లెట్టార‌ని సంచ‌ల‌న తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. పార్టీలో ప్రస్తుతం నెల‌కొన్న దారుణ ప‌రిస్థితులే త‌న రాజీనామాకు కార‌ణ‌మ‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు అవ‌స‌ర‌మైన ఏ ఒక్క అంశాన్ని కూడా పార్టీ నిలుపుకోలేక‌పోయింద‌ని, ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అస‌లు పార్టీ విజ‌యం సాధించ‌డం దుస్సాధ్య‌మ‌ని ఆయ‌న తేల్చేశారు.

మొత్తంగా ఇంటా బ‌యటా విమ‌ర్శ‌ల జ‌డివాన‌ను ఎదుర్కొంటున్న మోదీషాల‌కు బోరా త‌న రాజీనామాతో పెద్ద షాకే ఇచ్చార‌ని చెప్పాలి. ఇదిలా ఉంటే... బీజేపీ నుంచి బ‌యట‌కు వ‌చ్చేసిన త‌న‌కు అస్సాం కాంగ్రెస్‌ - అస్సాం గ‌ణ‌ప‌రిష‌త్‌ - ఆమ్ ఆద్మీ పార్టీల నుంచి ఆహ్వానం అందిందని బోరా చెప్పారు. అయితే తాను ఏ పార్టీలో చేర‌డం లేద‌ని తెలిపారు. అస‌లు బోరా ఎందుకు బీజేపీకి రాజీనామా చేశార‌న్న విష‌యానికి వ‌స్తే... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా మోదీ స‌ర్కారు నెర‌వేర్చ‌లేదన్న భావ‌న‌తోనే బోరా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా స‌మాచారం. అంతేకాకుండా అక్ర‌మంగా వ‌ల‌స వ‌చ్చిన బంగ్లాదేశీయుల‌ను వెన‌క్కు తిప్పి పంపుతామ‌ని ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన బీజేపీ... ఇప్ప‌టిదాకా ఆ దిశ‌గా దృష్టి సారించ‌క‌పోవ‌డం కూడా బోరా రాజీనామాకు ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. ఏది ఏమైనా బోరా రాజీనామా... మోదీషాలకు పెద్ద షాక్‌ గానే చెప్పాలి.