Begin typing your search above and press return to search.

క‌మ‌లానికి ఒక‌వైపు తీపి.. మ‌రోవైపు చేదు

By:  Tupaki Desk   |   24 Nov 2015 7:44 AM GMT
క‌మ‌లానికి ఒక‌వైపు తీపి.. మ‌రోవైపు చేదు
X
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న లోక్ స‌భ‌.. అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌ల్ని నిర్వ‌హిస్తున్నారు. తాజా ఉప ఎన్నిక‌ల్లో అధికార బీజేపీకి తీపి చేదుల ప‌రిస్థితి ఎదురైంది. దేశ‌వ్యాప్తంగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో కొన్ని చోట్ల బీజేపీకి షాకులు త‌గ‌ల‌గా.. మ‌రికొన్ని చోట్ల త‌న‌కున్న ప‌ట్టును నిల‌బెట్టుకుంది. స్థానికంగా ఉన్న ప‌రిస్థితులు ఉప ఎన్నిక‌ల్లో గెలుపోట‌ముల్ని ప్ర‌భావితం చేస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఇందుకు బీజేపీ ఏమీ మిన‌హాయింపు కాదు.

తెలంగాణ లోని వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక వ్య‌వ‌హార‌మే తీసుకుందాం. ఏ సమ‌యంలోనూ బీజేపీ గెలుస్తుంద‌న్న ఆలోచ‌న ఎవ‌రూ చేయ‌లేదు. అలాంటి ప‌రిస్థితి లేదు. తెలంగాణ అధికార‌ప‌క్షానికి కంచుకోట లాంటి వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మిని మోడీ ఖాతాలో వేయ‌ట‌మో.. లేదంటే బీజేపీ గాలి వీయ‌టం లేద‌న‌టం ఎంత‌మాత్రం స‌బ‌బు కాదు.

ఇదే తీరులో దేశ వ్యాప్తంగా జ‌రిగిన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల్నిచూడాల్సి ఉంది. నాలుగు చోట్ల బీజేపీ ఓడిపోవ‌టాన్ని మోడీకి ఎదురుగాలి వీస్తుంద‌న్న విశ్లేష‌ణ అర్థం లేనిది. తాజాగా జ‌రిగిన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల్ని చూస్తే.. బీజేపీకి తీపి.. చేదులు స‌మంగా ఎదుర‌య్యాయ‌ని చెప్పాలి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని ర‌త్లాం లోక్ స‌భ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక ఫ‌లితం బీజేపీకి కాస్తంత షాక్ గా చెప్పాలి. ఎందుకంటే.. ఇక్క‌డ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న బీజేపీ అభ్య‌ర్థి మ‌ర‌ణంతో తాజా ఉప ఎన్నిక జ‌రిగింది. అయితే.. ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి విజ‌యం సాధించారు. మిజ‌రోంలో జ‌రిగిన థోంగ్జూ అసెంబ్లీ స్థానం ఫ‌లితం బీజేపీకి వ్య‌తిరేకంగానే వ‌చ్చింది. ఇక్క‌డా కాంగ్రెస్ ముందంజ‌లో ఉంది. ఇక‌.. రాజ‌స్థాన్ లో అధికారంలో ఉన్న బీజేపీ త‌న ప‌ట్టును నిలుపుకుంది. దేవాస్ అసెంబ్లీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థి గాయ‌త్రీ రాజే గెలుపు దిశ‌గా ప‌య‌నిస్తున్నారు. ఇక‌.. మ‌ణిపూర్ లో జ‌రిగిన రెండు ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌యం సాధించింది. మొత్తంగా చూస్తే.. త‌న‌కు బ‌ల‌మున్న చోట బీజేపీ విజ‌యం సాధిస్తే.. త‌న‌కు ఏ మాత్రం బ‌లం లేని చోట బీజేపీ త‌న స‌త్తాను చాట‌లేద‌న‌టం స‌బ‌బుగా చెప్పొచ్చు.