Begin typing your search above and press return to search.

మోడీ గెలుపు ఖాయం స‌రే..యూపీ సీట్ల లెక్క‌ల్లో తేడా ఏల‌?

By:  Tupaki Desk   |   22 May 2019 5:41 AM GMT
మోడీ గెలుపు ఖాయం స‌రే..యూపీ సీట్ల లెక్క‌ల్లో తేడా ఏల‌?
X
మోడీ గెలుస్తారు. ఖాయంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. త‌న వ్య‌క్తిగ‌త ఛ‌రిష్మాతో ప్ర‌ధాని పీఠం మీద కూర్చున్న నేత‌గా మోడీ ఆవిర్భ‌వించ‌నున్నారు. అప్పుడెప్పుడో ఇందిర‌మ్మ త‌ర్వాత అంత‌టి క్రెడిట్ మోడీకి మాత్ర‌మే సొంత‌మ‌న్న మాట వినిపిస్తోంది. ఇదంతా వోకే. కానీ.. మోడీ గెలుపులో కీల‌క‌మైన యూపీలో బీజేపీ సాధించే సీట్ల లెక్క‌ల్లోకి వెళితేనే విప‌రీత‌మైన క‌న్ఫ్యూజ‌న్ క‌నిపిస్తోంది.

మోడీ గెలుపు మీద ఎగ్జిట్ పోల్స్ అన్ని ఏక‌గ్రీవంగా తీర్మానం చేసేసిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అనూహ్యంగా అన్ని ఎగ్జిట్ పోల్స్ లో క‌నిష్ఠంగా 290.. గ‌రిష్ఠంగా 380 సీట్ల వ‌ర‌కు వ‌స్తాయ‌ని చెప్పారు. దీన్ని కూడా ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌టం లేదు. ఇంత భారీగా మోడీకి సీట్లు రావాలంటే.. అతి పెద్ద రాష్ట్ర‌మైన యూపీలో భారీ ఎత్తున సీట్ల‌ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. మోడీ బంప‌ర్ మెజార్టీతో గెలుస్తార‌ని చెప్పే ఎగ్జిట్ పోల్స్ అన్ని.. సిత్రంగా యూపీలో బీజేపీ గెలిచే సీట్ల లెక్క‌ల మీద భిన్నాభిప్రాయాల్ని వ్య‌క్తం చేస్తున్నాయి. ప్ర‌తి ఒక్క సంస్థ మోడీ గెలుపుపై ధీమాను వ్య‌క్తం చేస్తూనే.. యూపీలో బీజేపీ సాధించే బీజేపీ సీట్ల మీద త‌మ‌దైన అంచ‌నాల్ని వెలువ‌రించ‌టం ఇప్పుడు ఇబ్బందిక‌రంగా మారింది.

80 సీట్లు ఉన్న యూపీలో బీజేపీకి భారీ ఎత్తున సీట్లు వ‌స్తాయ‌ని.. 70 ప్ల‌స్ సీట్లు ఖాయ‌మ‌న్న అంచ‌నాతోనే మోడీకి 300 ప్ల‌స్ సీట్ల లెక్క ఇచ్చిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదిలా ఉంటే.. యూపీలో 40కు మించిన సీట్లు రావ‌ని ఒక‌రు చెబితే.. యూపీలో దారుణ‌మైన ప‌రిస్థితిని బీజేపీ ఎదుర్కొంటుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. అదే జ‌రిగితే.. మోడీకి వ‌స్తాయ‌ని చెప్పే 300 అంకె ఎలా సాధ్య‌మ‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.ఈ చిక్కుముడిని ఏ ఎగ్జిట్ పోల్ సంస్థ విప్ప‌దీయ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. యూపీలో మెజార్టీ సీట్ల సాధ‌న లేకుండా.. మోడీ ప‌రివారం 300 అంకెను దాట‌టం క‌ష్ట‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అలాంట‌ప్పుడు యూపీలో లెక్క‌ల తేడాను ఎగ్జిట్ పోల్స్ ఎందుకు న‌మోదు చేసిన‌ట్లు? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. మొత్తానికి మోడీ గెలుపు ప‌క్కా అంటూనే.. యూపీలో బీజేపీకి వ‌చ్చే సీట్ల లెక్క‌ల్లో కొత్త సందేహాలు త‌లెత్తుతున్న ప‌రిస్థితి ఎందుకొచ్చిన‌ట్లు? అన్న ప్ర‌శ్న‌కు మాత్రం స‌మాధానం ఇవ్వ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.