ఇలాంటి కూటమి బీజేపీని ఏం చేయగలదు?

Sun Jun 09 2019 10:31:14 GMT+0530 (IST)

ఫలితాలు వచ్చే ముందు చంద్రబాబు నాయుడు దేశమంతా తిరిగారు. ప్రతి నగరానికి వెళ్లారు. అక్కడి పార్టీల వారితో మాట్లాడారు. చంద్రబాబు నాయుడి అసలు ఉద్దేశం ఏమున్నా - కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమిని కట్టడమే తమ లక్ష్యమని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విపక్ష కూటమి అని అప్పుడు చంద్రబాబు నాయుడు హడావుడి చేశారు!తీరా ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ చిత్తు అయిపోయింది. ఇప్పుడు బీజేపీ వ్యతిరేక కూటమి గురించి కానీ - బీజేపీ వ్యతిరేకత గురించి కానీ చంద్రబాబు నాయుడు మాట్లాడటం లేదు. మాట్లాడటానికి ఇష్యూస్ ఉన్నా ఆయన నోరు తెరవడం లేదు. ఫలితాలు వచ్చే ముందు చంద్రబాబు నాయుడు చేసిన హడావుడికి - ఇప్పుడు ఆయన సైలెంట్ గా ఉండిపోవడానికి అసలు ఏ మాత్రం సాపత్యం లేకుండా పోయింది!

ఇక్కడ చంద్రబాబు నాయుడును నిందించడం లేదు. విపక్ష కూటమి పరిస్థితి గురించి చెప్పడానికి చంద్రబాబు తీరును ప్రస్తావించాల్సి వస్తోంది. బీజేపీకి వ్యతిరేక కూటమి అని హడావుడి చేసిన వాళ్లంతా ఇప్పుడు కామ్ అయిపోయారు. ఏదో ఎన్నికల ముందు  జట్టు కట్టి ఇప్పుడు ఇక ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇక పనిలేదన్నట్టుగా వాళ్లంతా ఎక్కడి వారు అక్కడే గప్ చుప్ అయ్యారు!

బీజేపీ వ్యతిరేకతే అజెండాకా యూపీలో చేతులు కలిపిన ఎస్పీ - బీఎస్పీలు అప్పుడే పక్కదారి పట్టాయి. ఒక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలగానే ఇక కలిసి పోటీ చేసేది లేదన్నట్టుగా ఆ పార్టీలు తేల్చేశాయి. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు కేవలం కొద్ది సమయం ముందు చేతులు కలిపిన ఆ పార్టీల ఓటు బ్యాంకు కలవలేదని స్పష్టం అయితే అయ్యింది. అయితే ఆ రెండు పార్టీలూ తదుపరి ఐదేళ్లూ కలిసి కట్టుగా పోరాడితే ఓటు బ్యాంకుల కలయిక కూడా సాధ్యం అవుతుందేమో!

కార్యకర్తలకు - ప్రజలకు సమయం ఇచ్చి.. తాము కలిసి పోరాడతామనే సంకేతాలు ఇస్తే ఐదేళ్ల తర్వాత అయినా ఆ పార్టీలు సత్తా చూపిస్తాయేమో. అయితే ఆ పార్టీలకు అంత ఓపిక లేకపోయింది. ఆ పార్టీలకు అనే కాదు.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే. ఎన్నికలు  అయ్యాకా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు. అందరితోనూ ఒక సమావేశం నిర్వహించి.. తామంతా కలిసి పోరాడాలని - బీజేపీని మరీ నియంతగా తయారు చేయకూడదని కూడా ఆ పార్టీల్లో స్ఫూర్తిని నింపలేకపోయింది కాంగ్రెస్ పార్టీ! కాంగ్రెస్ పెద్దన్న పాత్రను తీసుకుని అందరినీ కలుపుకుపోవాలి. నిజంగానే బీజేపీ వ్యతిరేకతే అజెండా అయితే మిగిలిన ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ తో చేతులు కలపాలి. అలా కాకుండా ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడు హడావుడి చేయడం - మిగతా సమయంలో ఎవరికి వారు ఉండిపోతే..ఈ కూటమి కాంగ్రెస్ ను ఏమీ చేయలేదని చెప్పవచ్చు!