కోమటి రెడ్డి బ్రదర్స్-కమలం పార్టీ..డీల్ ఏంటి?

Wed Sep 13 2017 12:46:24 GMT+0530 (IST)

అంతా సిద్ధమైనట్టే కనిపిస్తోంది.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పుణ్యమా అని కాంగ్రెస్ లో  అంతంత మాత్రంగా ఉన్న కోమటి రెడ్డి బ్రదర్స్ కి బీజేపీ బాగానే గాలమేసిందని తెలుస్తోంది. నిన్నటి వరకు టీఆర్ ఎస్ లో చేరుతారని ప్రచారం జరిగినా.. అదే జిల్లాకు చెందిన గుత్తా - జగదీశ్ రెడ్డి లాంటి నేతలు అన్నదమ్ముల్ని రానివ్వకుండా చేస్తున్నారన్న వార్తలొచ్చాయి. దీంతో  తెలంగాణ లో సరైన నేతల కోసం ఎదురు చూస్తున్న బీజేపీ కోమటిరెడ్డి బ్రదర్స్ కు టచ్ లోకొచ్చినట్టు తెలుస్తోంది.  అంతే కాదు... బ్యాక్ గ్రౌండ్ అంతా సిద్ధమయ్యిందని... సెప్టెంబర్ 17న నిజాం కాలేజీ గ్రౌండ్లో సభ పెట్టి బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం కూడా బాగానే సాగుతోంది.2019 ఎన్నికల్లో తెలంగాణలో కీలక ప్రచార బాధ్యతల్ని కూడా బ్రదర్స్ కి అప్పగించేందుకు కమనాధులు సరే అన్నారట. ఆ పై రాజగోపాల్ రెడ్డికి ఎంపీ టిక్కెట్ ఇచ్చి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తామని ప్రామిస్ చేశారట. అక్కడితే ఆగిపోలేదు బీజేపీ హామీలు. మరో ఐదేళ్ల తర్వాత  అంటే 2024 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే బ్రదర్స్ లో ఒకర్ని సీఎం చేస్తామని కూడా ముందే చెప్పేసిందంట బీజేపీ. దీంతో బ్రదర్స్ ఓకే చెప్పడమే మిగిలిందన్నది వారి సన్నిహితుల మాట.

అయితే ఇంత ప్రచారం జరుగుతున్నా... బ్రదర్స్ మాత్రం... పాత పాటే పాడుతున్నారు. తాము కాంగ్రెస్ ను వీడి వెళ్లేది లేదనే చెబుతూ వస్తున్నారు. గిట్టని వారు చేస్తున్న ప్రచారమని చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో మాత్రం అన్నదమ్ముల రాజకీయ భవితవ్యంపై తెగ చర్చ జరుగుతోంది. అందరి చూపు సెప్టెంబర్ 17పైనే ఉంది.