Begin typing your search above and press return to search.

బిల్లు ఒక‌రిది.. లొల్లి మ‌రొక‌రిది

By:  Tupaki Desk   |   20 July 2016 6:55 AM GMT
బిల్లు ఒక‌రిది.. లొల్లి మ‌రొక‌రిది
X
కాంగ్రెస్‌ - వైసీపీలు పెట్టిన రెండు ప్ర‌యివేటు మెంబ‌ర్ బిల్లులు ఇప్పుడు వేరే రెండు పార్టీల మ‌ధ్య చిచ్చు ర‌గిలిస్తున్నాయి. ఒక‌దాంతో ఒక‌టి సంబంధం లేకుండానే కాంగ్రెస్‌ - వైసీపీలకు చెందిన ఇద్ద‌రు స‌భ్య‌లు వేర్వేరు అంశాల‌పై ప్ర‌యివేటు మెంబ‌ర్ బిల్లులు పెట్టిన సంగ‌తి తెలిసిందే. అందులో కాంగ్రెస్ నేత కేవీపీ పెట్టిన ప్ర‌త్యేక హోదా బిల్లు బీజేపీని ఇరుకున‌పెట్టేలా ఉండ‌గా.. వైసీపీ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ఫిరాయింపుల‌పై పెట్టిన బిల్లు టీడీపీకి ఇబ్బందిక‌రంగా ఉంది. అయితే... కేవీపీ బిల్లుకు టీడీపీ మ‌ద్ద‌తు ఇస్తామ‌ని అంటుండ‌డంతో ఆ పార్టీ మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ అదెలా కుదురుతుంద‌ని ప్ర‌శ్నిస్తోంది. అంతేకాదు... టీడీపీ క‌నుక ఆ ప‌నిచేస్తే తాము విజ‌య‌సాయిరెడ్డి బిల్లుకు మ‌ద్ద‌తు ఇచ్చి టీడీపీని ఇర‌కాటంలోకి నెడతామ‌ని కూడా హెచ్చ‌రిస్తున్నారు.

ప్రత్యేక హోదా బిల్లు విష‌యంలో తెదేపా రాజ‌కీయం చేస్తోంద‌ని.. కాంగ్రెస్ తో క‌లిసి కుట్ర చేస్తోంద‌ని.. అస‌లు తెదేపా ప్లాను ప్ర‌కార‌మే కాంగ్రెస్ ఈ బిల్లు పెట్టింద‌ని కూడా బీజేపీ అనుమానిస్తున్న‌ట్లుగా స‌మాచారం. ఓటింగు సాధ్యం కాని ప్రత్యేక హోదా బిల్లును అడ్డుపెట్టుకుని తెదేపా రాజకీయం చేస్తోందని.. కేంద్రంలో టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు ఉండగా కాంగ్రెస్ ఎంపి కేవీపీ పెట్టిన ప్రైవేటు బిల్లును టీడీపీ ఎలా సమర్థిస్తుందని భాజపా నేతలు మండిపడుతున్నారు. ఏడాది నుంచీ ఈ అంశంలో తెదేపా కాంగ్రెస్ నేతలతో హోదాపై పరోక్షంగా ఒత్తిడి చేయిస్తూ - మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తోందన్న అనుమానం భాజపాలో వ్యక్తమవుతోంది.

ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు ఓటింగుకు వస్తుందన్న చర్చ నేపథ్యంలో - ఓటింగు జరిగితే తమ మద్దతు ఉంటుందని టీడీపీ ఎంపీలు జేసీ దివాకర్‌ రెడ్డి - టిజి వెంకటేష్ బహిరంగంగా ప్రకటించడాన్ని బిజెపి తప్పుపడుతోంది. దీని వెనుక తెదేపా రహస్య అజెండా ఉందని - అసలు తెదేపా నాయకత్వమే కాంగ్రెస్ ఎంపితో బిల్లు పెట్టించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ప‌లు ఆధారాల‌ను కూడా బీజేపీ చూపిస్తోంది.

కేవీపీ బినామీ కంపెనీకి వైఎస్ ప్రభుత్వం గతంలో ప్రాజెక్టులు కట్టబెట్టిందని ఆరోపించిన టీడీపీ ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్టును అదే కంపెనీకి కట్టబెట్టిందని.. దాన్ని కేవీపీ - టీడీపీ రహస్య బంధమేమిటో అర్థ‌మ‌వుతోంద‌ని బీజేపీ నేతలు అంటున్నారు. మిత్రధర్మం పాటిస్తున్న తమను టీడీపీ కావాలనే రెచ్చగొడుతోందని బిజెపి నేతలు అంటున్నారు. టీడీపీ తీరు మార‌క‌పోతే... వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి ఫిరాయింపుల నిరోధక చట్టంపై ఇచ్చిన ప్రైవేటు మెంబరు బిల్లుకు తాము మ‌ద్ద‌తు ఇవ్వాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్‌ - వైసీపీలు పెట్టిన ప్ర‌యివేటు బిల్లులు టీడీపీ - బీజేపీల మ‌ధ్య పెద్ద చిచ్చునే ర‌గిలించాయి.