బీజేపీ వర్సెస్ తృణమూల్.. రణరంగం..

Wed Jun 12 2019 15:55:08 GMT+0530 (IST)

సార్వత్రిక ఎన్నికల వేడి బెంగాల్ లో తగ్గడం లేదు. మొన్నటి ఎన్నికల సందర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ బీజేపీలు నువ్వానేనా అన్నట్టు పోరాడాయి.  నరేంద్రమోడీ షాలు ఒకవైపు బెంగాల్ సీఎం మమతలు మరోవైపు అగ్గి రాజేశారు.  ఈ లొల్లిలో బీజేపీ చాలా లాభపడింది. పార్టీ ఎంపీ సీట్లు 2014లో 2 నుంచి ఇప్పుడు 18కి పెంచుకోగలిగింది. దీంతో ఓటమి బాధలో తృణమూల్ నేతలు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో చెలరేగిపోతున్నారు.పోలింగ్ కు ముందు తరువాత పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ బీజేపీ నేతల గొడవల్లో దారుణ హత్యలు చోటుచేసుకున్నారు. ఇప్పటికే ముగ్గురు బీజేపీ నాయకులు హత్యకు గురయ్యారు. తాజాగా మరో హత్య చోటుచేసుకుంది. దీంతో బీజేపీ శ్రేణులు ఈ సంగతి తేల్చడానికి కోల్ కత ముట్టడికి రెడీ అయ్యారు.

బుధవారం ఉదయం కోల్ కతా లో భారీ స్థాయిలో బీజేపీ నాయకులు కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బీజేపీ నాయకులతో నగరమంతా కాషాయమయమైంది. ఇది హింసకు దారి తీసింది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం.. రహదారులపై రచ్చ చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి అదుపుతప్పింది.

కోల్ కతా బీజేపీ ఆందోళనతో రణరంగంగా మారింది. పోలీసుల లాఠీచార్జి వాటర్ కానన్లతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేతల ఆందోళనలు.. పోలీసుల అడ్డుకోవడంతో కోల్ కతాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.