తెలంగాణ ఎన్నికల్లో మరో కూటమి!

Thu Nov 08 2018 17:06:15 GMT+0530 (IST)

తెలంగాణ రాజకీయాల్లో మరో పొత్తు పొడిచింది. కేంద్రంలోని బీజేపీకి తెలంగాణలో కొత్త స్నేహితుడు దొరికాడు. తెలంగాణలో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీజేపీ స్కెచ్ గీసింది. తాజాగా భువనగిరికి చెందిన కీలక నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడిన యువ తెలంగాణ పార్టీతో జత కట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఇప్పటికే యువ తెలంగాణ పార్టీ నేతలు బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరిపారు.తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ యువ తెలంగాణ పార్టీ తమతో కలిసి పనిచేయాలని నిర్ణయించడం శుభసూచికమని అన్నారు. మరికొందరు తెలంగాణ వాదులు బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

దత్తాత్రేయ ఈ పొత్తు పొడవడంలో కీలక పాత్ర పోషించారు. యువ తెలంగాణ పార్టీకి పోయే సీట్లను కూడా ఖరారు చేశారు. దాని ప్రకారం తాజాగా బీజేపీ యువ తెలంగాణ పార్టీకి 10 సీట్లు కేటాయించడానికి నిర్ణయించింది. బీజేపీ యువ తెలంగాణ పార్టీ పొత్తుల్లో భాగంగా జిట్టా బాలకృష్ణారెడ్డి భువనగిరి నుంచి .. వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి ప్రముఖ జర్నలిస్ట్ రాణి రుద్రమ పోటీ చేసే అవకాశాలున్నాయి.

మొదట్లో కోదండరాంతో పొత్తుకు బీజేపీ ప్రయత్నించింది. అయితే ఆయన మహాకూటమి వైపు అడుగులు వేశారు. దీంతో తమతో కలిసి వచ్చే పార్టీలవైపు బీజేపీ చూడగా.. యువ తెలంగాణ పార్టీ ముందుకొచ్చింది. దీంతో తెలంగాణ ఎన్నికల్లో మరో కూటమి బరిలోకి దిగినట్టైంది..