Begin typing your search above and press return to search.

మిథాలీ సేన‌కు భారీ న‌జ‌రానా అందిందే!

By:  Tupaki Desk   |   22 July 2017 11:42 AM GMT
మిథాలీ సేన‌కు భారీ న‌జ‌రానా అందిందే!
X
క్రికెట్‌లో భార‌త్ స‌త్తాను చాటిన వారిలో ఇప్ప‌టిదాకా మ‌నం చెప్పుకుంటున్న వారంతా జెంటిల్మ‌న్ క్రికెట‌ర్లే. అదేనండీ... అంతా పురుష క్రికెట‌ర్లే. ఓ క‌పిల్ దేవ్‌ - ఓ సునీల్ గ‌వాస్క‌ర్‌ - ఓ స‌చిన్ టెండూల్క‌ర్‌ - ఓ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ - ఓ విరాట్ కోహ్లీ.... ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే... ఈ జాబితా నిజంగానే చాంతాడంత అవుతుంది. అప్పుడెప్పుడో 1983లో క‌పిల్ దేవ్ నేతృత్వంలోని టీమిండియా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ను నెగ్గింది. నాడు క‌పిల్ డెవిల్స్‌గా జ‌ట్టు చేసిన విన్యాసాల‌ను మ‌నం క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకున్నాం. ఆ త‌ర్వాత భార‌త జ‌ట్టు మ‌రోమారు వ‌ర‌ల్డ్ క‌ప్‌ ను చేజిక్కించుకునేందుకు సుదీర్ఘ కాల‌మే వేచి చూడ‌క త‌ప్ప‌లేదు.

ర‌న్స్ మిష‌న్‌ గా వినుతికెక్కిన స‌చిన్ టెండూల్క‌ర్ నేతృత్వంలో ఆ క‌ప్ ను మ‌నోళ్లు మరోమారు తెస్తార‌ని అంతా భావించారు. అయితే కెప్టెన్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ జ‌ట్టు బాధ్య‌త‌లు చేప‌డితే గానీ... ఆ క‌ల నెర‌వేర‌ని వైనం. అయినా టీమిండియా క్రికెట‌ర్ల‌కు ఏనాడైనా న‌జ‌నారాలు త‌గ్గాయా? అంటే... లేద‌నే చెప్పాలి. ఓడినా, నెగ్గినా... టీమిండియా స‌భ్యుల‌కు డ‌బ్బే డ‌బ్బు. మ‌రి అదే స‌మ‌యంలో పురుష క్రికెట‌ర్ల‌తో స‌రిస‌మానంగా రాణిస్తున్న మ‌న లేడీ క్రికెట‌ర్ల ప‌రిస్థితిని ఓసారి ప‌రిశీలిస్తే.. అస‌లు మ‌హిళల జ‌ట్టు కెప్టెన్ ఎవ‌రో కూడా మ‌న పురుష క్రికెట‌ర్ల‌కు తెలియ‌ని ప‌రిస్థితి.

ఇక బీసీసీఐ అయితే... జెంటిల్మ‌న్ల‌కే పెద్ద పీట వేసింది గానీ... జెంటిల్ ఉమెన్ల‌ను మాత్రం ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌నే చెప్పాలి. అయితే ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మ‌హిళ‌ల ప్ర‌పంచ క‌ప్ లో మ‌న తెలుగ‌మ్మాయి మిథాలీ రాజ్ నేతృత్వంలోని లేడీ క్రికెట‌ర్లు తిప్పేస్తున్నారు. టోర్నీలో మునుపెన్న‌డూ లేని రీతిలో స‌త్తా చాటుతూ ఫైన‌ల్ కు చేరుకున్నారు. ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ చేరితేనే గానీ... వారిలోని ప్ర‌తిభ‌ను గుర్తించ‌లేని మ‌న బీసీసీఐ... కాస్తంత ఆల‌స్యంగానైనా మ‌హిళా జ‌ట్టు స‌భ్యుల‌ను కూడా కోటీశ్వ‌రుల‌ను చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

మ‌హిళా క్రికెట్ జ‌ట్టు స‌భ్యులంద‌రికీ ఒక్కొక్క‌రికి రూ.50 ల‌క్ష‌ల చొప్పున న‌జరానాను ఇవ్వ‌నున్న‌ట్లు బీసీసీఐ కాసేప‌టి క్రితం ప్ర‌క‌టించింది. ఫైన‌ల్ చేరితేనే అర‌కోటి న‌జ‌రానా కొట్టేసిన మ‌న లేడీ క్రికెటర్లు రేపు జ‌రిగే తుది పోరులో క‌ప్‌ ను కొట్టేస్తే.. మ‌రింత‌గా న‌జారానా ద‌క్క‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. సో... రేప‌టి మ్యాచ్‌లో మ‌న లేడీ క్రికెటర్లు కూడా స‌త్తా చాటి క‌ప్ ను గెల‌వ‌డంతో పాటు క‌రోడ్ ప‌తిగా మారాల‌ని మ‌నం కూడా మ‌న‌సారా ఆశిద్దాం.