పంత్ కు నో బెర్త్... రీజన్ రెడీ చేసుకుని దెబ్బేశారా?

Mon Apr 15 2019 18:19:31 GMT+0530 (IST)

రిషబ్ పంత్... ప్రస్తుతం భారత క్రికెట్ లో అత్యుత్తమంగా రాణిస్తున్న యువ క్రికెటర్. జట్టులోకి వచ్చీ రాగానే తనదైన శైలి సత్తా చాటుతూ సాగుతున్న పంత్... ఇటు బ్యాట్స్ మన్ గానే కాకుండా అటు వికెట్ కీపర్ గానూ రాణిస్తున్నాడు. ప్రస్తుతం పంత్ ను చూస్తుంటే... తొలి నాళ్లలో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీని చూసినట్టే ఉందన్న మాట కూడా బాగానే వినిపిస్తోంది. పంత్ కంటే ముందే తెరంగేట్రం చేసిన వికెట్ కీపర్లు చాలా మందే ఉన్నా... ధోనీ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్లుగా గుర్తింపు సంపాదించలేదనే చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో ధోనీ రిటైర్ అయితే పరిస్థితి ఏమిటన్న వాదన కూడా వినిపించింది. ఈ తరుణంలోనే పంత్... జూనియర్ ధోనీలా జట్టులోకి వచ్చేశాడు. మొత్తంగా ధోనీ లేమిని ఇట్టే తీసిపారేసే ఆటగాడిగా పేరు తెచ్చుకున్న పంత్... త్వరలో జరగబోయే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కు వెళ్లే జట్టులో తప్పనిసరిగా ఉంటాడని అంతా భావించారు.అయితే అనూహ్యంగా పంత్ లేని లిస్టునే కొద్దిసేపటి క్రితం బీసీసీఐ ప్రకటించేసింది. జట్టులో ధోనీ ఉన్నాడు కాబట్టి... పెద్దగా వికెట్ కీపర్ల అవసరం లేదు గానీ... పంత్ లాంటి బ్యాట్స్ మన్ జట్టుకు అవసరమే కదా అన్నది సగటు క్రికెట్ అభిమాని ప్రశ్నగా వినిపిస్తోంది. అయితే పంత్ ను జట్టులోకి తీసుకోకపోతే.. ఈ తరహా ప్రశ్నలు ఎదురవుతాయని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ముందే భావించిందో ఏమో తెలియదు గానీ... ఆ ప్రశ్నకు ముందుగానే సమాధానాన్ని సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పంత్ కు బదులుగా సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్ ను జట్టులోకి తీసుకున్న బీసీసీఐ... పంత్ కు బదులుగా కార్తీక్ ను ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని సిద్ధంగా ఉంచుకునే జట్టు కూర్పును ప్రకటించింది.

అయినా దినేశ్ అయినా పంత్ అయినా.. ధోనీ ఆడలేని సమయంలోనే క్రీజులోకి దిగుతారని తెలిపింది. మరి అలాంటప్పుడు పంత్ నే తీసుకోవచ్చు కదా అంటే... ఒకవేళ ధోనీ ఆడలేకపోయిన సందర్బంలో వరల్డ్ కప్ లోని ప్రతి మ్యాచ్ కీలకమైనదే కాబట్టి... ఒత్తిడిని తట్టుకోవడంలో పంత్ కంటే మెరుగైన రీతిలో రాణించే అవకాశాలున్న దినేశ్ ను తీసుకున్నట్లుగా బీసీసీఐ వివరణ ఇచ్చింది. మొత్తంగా పంత్ ను జట్టులోకి తీసుకోకపోతే... ఎదురయ్యే పరిణామాలను ముందుగానే ఊహించిన బీసీసీఐ... ఆ పరిణామాలకు ఎలాంటి ఆయింట్ మెంట్ రాయాలన్న విషయాన్ని కూడా సిద్ధం చేసుకుని మరీ పంత్ కు హ్యాండిచ్చేసిందన్న మాట.